China Manja For Kites: పీకలు తెగుతున్నా హైదరాబాద్‌లో ఆగని చైనా మాంజా అమ్మకాలు- ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ
Chinese Manja For Kites | పతంగులు ప్రాణాలు తీస్తున్నా మార్పు రావడంలేదు. హైదరాబాద్ వ్యాప్తంగా మాంజా అమ్మకాలను అడ్డుకోలేకపోతున్నారా ? ధూల్ పేట్ సాక్షిగా మాంజా విక్రయాలపై ఏబిపి ఫ్యాక్ట్ చెక్ స్టోరీ
Hyderabad Kite Festival | హైదరాబాద్ ధూల్ పేటలో కైట్స్ అమ్మకాలు ఏటా ఓ ఉత్సవంలా జరుగుతాయి. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలో ఉన్న వీధి పొడవునా కైట్స్ స్టాల్స్ తో కిక్కిరిసిపోతుంది. కేవలం హైదరాబాద్ నగరం నలుమూల నుంచి మాత్రమేకాదు తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సైతం ధూల్ పేట్ పతంగుల బాజార్ లో గాలిపటాలు కొనేందుకు వేలాదిగా జనం తరలివస్తుంటారు. బయట మార్కెట్ ధరలో పోల్చితే పతంగులు అత్యంత తక్కువ ధరలకు లభించడమేకాదు, మరెక్కడా దొరకని వివిధ రంగుల్లో, వినూత్న ఆకారాల్లో కైట్స్ ఇక్కడ ధూల్ పేట మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. కానీ ఇక్కడ ధూల్ పేట పతంగుల మార్కెట్ నిషేధంలో ఉన్న మాంజా అమ్మకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి.
జనాల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా
ప్రతీ ఏటా మూడు రోజులపాటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అయితే చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చేతులు , కాళ్లు తెగిపడి అనేక మంది ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. వందలాది పక్షులకు రెక్కలు తెగిపడి గాల్లోనే ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుర్రాయిగూడెం గ్రామానికి చెందిన ఏరువా కృష్ణారావు ఉద్యోగం ముగిశాక బైక్ పై ఇంటికి వెళ్తుండగా గాలిపటానికి కట్టిన మాంజా గొంతుకు తగిలి గొంతు భాగంలో తెగిపోవడంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాదికూడా ఇలాంటి ఘటనలు తెలంగాణా వ్యాప్తంగా ఎన్నో జరిగాయి.
ఆగని చైనా మాంజా అమ్మకాలు
ఇంత జరుగుతున్నా మాంజా అమ్మకాలు ఏమాత్రం ఆగడంలేదు. నిబంధనలు ఉన్నా.. మాంజా అమ్మాకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవనే ప్రకటన బోర్డులు ధూల్ పేట పతంగుల బాజార్ లో ప్రతీ దుకాణంలోనూ దర్శనమిస్తున్నా ఫలితంలేదు. గుట్టుచప్పుడు కాకుండా మాంజా అమ్మకాలు మాత్రం జరిగిపోతున్నాయి. ఈ ఏడాది కూడా అదే తంతు కొనసాగుతోంది. ఏబీపీ దేశం క్షేత్రస్దాయిలో వాస్తవ పరిస్దితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది.
దూల్ పేట్ పతంగుల బజార్ లో పైకి కనిపించే అమ్మకాల లోపల మాంజా విక్రయాలు నిగ్గుతేల్చింది. మంగళ్ హాట్ పోలీస్టేషన్ కు అత్యంత సమీపంలో ఉన్నా, పోలీసులు కైట్స్ అమ్మకాలు జరుగుతున్న దుకాణం వద్ద గస్తీ కాస్తున్నా , మంజా కట్టి ఎగురుతున్న గాలిపటాలు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పతంగులు పట్టుకుంటే చాలు చేతులు తెగేలా మాంజా ఇక్కడ వీధుల్లో కనిపిస్తోంది. గాలిపటాల నుండి తెగిపడిన మాంజా ఇక్కడ వీధుల్లో కాళ్లకు చుట్టుకుంటూా దర్శనమిస్తోంది.
నిబంధనలు అమలు చేస్తున్నారా ?
మాంజా అమ్మకాలపై ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడంలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ ఏటా జరిగే తంతులా ఈ ఏడాది మాంజా యమపాశంలా మారి ప్రాణాలు బలితీసుకుంటోది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతికి బైక్ తీసుకుని రోడ్డెక్కితే కాళ్లు చేతులు తెగిపడకుండా ఇంటికి చేరితే చాలు అన్నట్లుగా తయారైయ్యింది నగరవాసుల దుస్దితి.
చైనా మాంజాపై నిషేధం ఉన్నా, ధూల్ పేట మార్కెట్ కు మాంజా ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడ తయారవుతోందనేది క్షేత్రస్దాయిలో అడ్డుకునే ప్రణాళికలలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనం ప్రాణాలు తీసే మాంజా విక్రయాలను కట్టడి చేయాలంటే కేవలం పతంగులు అమ్మకాలు జరిగే దుకాణాల వద్ద ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేమిలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.