Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Laxmi Vilas Palace: ముకేష్ అంబానీ కుటుంబం నివశిస్తున్న ఆంటిలియా ఖరీదు రూ.15,000 కోట్లని అంచనా. ఒక మహిళ ఆంటిలియా కంటే ఖరీదైన భవనం 'లక్ష్మి విలాస్ ప్యాలెస్'లో రాజభోగాలతో నివసిస్తోంది.

Laxmi Vilas Palace Worth And Other Details: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani,) తన కుటుంబంతో కలిసి నివశిస్తున్న భవనం పేరు యాంటిలియా (Antilia). ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ బిల్డింగ్ 27 అంతస్తులతో, 173 మీటర్లు లేదా 568 అడుగుల ఎత్తుతో ఠీవిగా నిలబడి కనిపిస్తుంది. దాని విలువ దాదాపు రూ. 15,000 కోట్లు అని అంచనా. ఆ భననం ఒక రాజభవంతి కంటే తక్కువ కాదు. అయితే, ఆంటిలియా కంటే విలాసవంతమైన ఇంట్లో నివసించే మహిళ ఒకరు మన దేశంలోనే ఉన్నారు.
ప్యాలెస్ ఖరీదు దాదాపు రూ. 25,000 కోట్లు
బరోడా మహారాజా సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ (Samarjit Singh Gaekwad) సతీమణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ (Radhikaraje Gaekwad) నివశించే అందమైన రాజభవనం పేరు "లక్ష్మి విలాస్ ప్యాలెస్". ఆమె ఉంటున్న భవనం విలువ దాదాపు రూ. 25,000 కోట్లని అంచనా. మహారాజా సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్ బరోడా 16వ మహారాజు. ఆయన 2012లో రాజ కుటుంబ సింహాసనాన్ని అధిష్టించారు, ఇప్పటికీ మహారాజుగా కొనసాగుతున్నారు. ఈ రాజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు - పద్మజా రాజే గైక్వాడ్, నారాయణి రాజే గైక్వాడ్.
1890లోనే రూ. 27 లక్షలు ఖర్చు
లక్ష్మి విలాస్ ప్యాలెస్ గుజరాత్‌లోని వడోదరలో ఉంది. దీనిని బరోడా ప్యాలెస్ (Baroda Palace) అని కూడా పిలుస్తారు. గైక్వాడ్ రాజ కుటుంబ నిర్మాణం చూడముచ్చటగా ఉంటుంది & జీవితంలో ఒక్కసారైనా సందర్శించదగినది. 700 ఎకరాల్లో (సుమారు 3,04,92,000 చదరపు అడుగులు) విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్, బ్రిటిష్ రాజ కుటుంబ నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. లక్ష్మి విలాస్ ప్యాలెస్‌లో 170 గదులు, అద్భుతమైన ఉద్యానవనం, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ గోల్ఫ్ కోర్సు కూడా ఉన్నాయి. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III 1890లో దాదాపు రూ. 27 లక్షల (1,80,000 పౌండ్లు) ఖర్చుతో ఈ రాజభవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ మేజర్ చార్లెస్ మాంట్ పర్యవేక్షణలో ఈ భవనంతిని నిర్మించారు.
రాజభవనం సందర్శినకు ప్రజలకు అనుమతి
బరోడా ప్యాలెస్‌ను సందర్శించడానికి ప్రజలకు తలుపులు తెరిచే ఉంటాయి. అయితే, ప్యాలెస్ మొత్తంలోకి కాకుండా ఒక భాగంలోకి మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుంది. ఈ ప్యాలెస్‌ను చూడడానికి దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. రాజభవనం సందర్శన ఉచితం మాత్రం కాదు, గేటు దగ్గరే మనిషికి రూ. 200 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. ఈ ప్యాలెస్ మంగళవారం నుంచి ఆదివారం వరకు, ఉదయం 10:30 నుంచి సాయంత్రం 05:30 వరకు తెరిచి ఉంటుంది. సోమవారం నాడు మాత్రం ఈ రాజభవనంలోకి ఎవరికీ అనుమతి ఉండదు.
రాధికరాజే గైక్వాడ్ గురించి...
మహారాణి రాధికరాజే గైక్వాడ్ వాంకనేర్ రాజ కుటుంబానికి చెందినవారు. గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఉన్న వాంకనేర్, ఝాలా రాజవంశపు పరిపాలనలో ఉండేది. మహారాణి రాధికరాజే గైక్వాడ్ తండ్రి డాక్టర్ ఎం కె రంజిత్‌సిన్హ్ ఝాలా. UPSC కోసం తన రాజ బిరుదును వదులుకుని, IAS అధికారి అయ్యారు. బి.ఎ. హిస్టరీ (ఆనర్స్) లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాధికరాజే గైక్వాడ్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

