Grama Palana officers: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు మంజూరు, ఉత్తర్వులు జారీ
Telangana Jobs 2025 | తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో మార్పులు చేర్పులు చేపట్టింది. గతంలో ఉన్న వీఆర్వో, వీఆర్ఏల స్థానంలో కొత్తగా గ్రామ పాలనా అధికారులను నియమించాలని పోస్టులు మంజూరు చేశారు.

Grama Palana officers in Telangana : తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్వో, VRA వ్యవస్థను పునరుద్ధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ గ్రామానికి అధికారిని నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులు మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో 10,954 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులు ఏర్పడ్డాయి. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి మొదట ఆప్షన్స్ తీసుకుని, తరువాత నియామకాలు చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ 28 వరకు వీఆర్వోలు, వీఆర్ఏల పునరుద్ధరణకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల (జీపీఓ) నియామకం
తెలంగాణలో మొత్తం 10,954 వరకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న వీఆర్ఏ, వీఆర్వోలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర శాఖల్లోకి బదిలీ చేసింది. ధరణి పోర్టల్ వచ్చాక, వారిని రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు బదిలీ చేశారు. అయితే మాజీ వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భూ భారతి చట్టంతో అమల్లోకి కొత్త విధానాలు
తెలంగాణ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ధరణి రిజిస్ట్రేషన్ ని రద్దు చేస్తూ భూ భారతి చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను జీపీవో (గ్రామ పాలనా అధికారులు)గా తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ శాఖలో సంస్కరణల పేరిట వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములకు సంబంధించిన అనుమతులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని మళ్లీ తీసుకొస్తుంది. వీఆర్వో, వీఆర్ఏ స్థానంలో గ్రామ పాలన అధికారులను నియమించేందుకు పది వేలకు పైగా పోస్టులు మంజూరు చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

