అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అందరి మైండ్‌లో తిరుగుతోంది. ఆ ప్రశ్న ఏంటంటే.. రేపు సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. రీసెంట్‌గా కొద్ది రోజుల క్రితం ఎంతో కాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి టార్గెట్ చేయడమే కాకుండా.. ఇకపై ప్రజా క్షేత్రంలో ఉంటానని కూడా అన్నారు. ఇలాంటి టైంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి కూడా వస్తారా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ముఖ్యంగా చాలా కాలంగా కేసీఆర్‌కి తనని గెలిపించిన ప్రజల తరపున గళం వినిపించాలనే చిత్త శుద్ధి ఉంటే.. వారి తరపున పోరాడాలనే ఆలోచన ఏ మాత్రం ఉన్నా.. అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నుంచి, అందులోనూ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి సవాల్ వస్తూనే ఉంది. ఇలాంటి టైంలో కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం వస్తోంది. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి ఈ రోజు ఆదివారం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రేపు అసెంబ్లీకి హాజరవుతారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది? అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తేనే తెలిసేది.
ఏది ఏమైనా.. ఒకవేళ సోమవారం నాడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. బీఆర్ఎస్ మళ్లీ పూర్తి సత్తాతో కాంగ్రెస్‌ని ఢీ కొట్టడానికి రెడీ అయినట్లే అనుకోవచ్చు. అలా కాకుండా ఈ సారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటే మళ్లీ కాంగ్రెస్‌కి ఇదో అవకాశంగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే మీరేం అంటారు? కేసీఆర్ అసెంబ్లీకి రావాలాంటారా? లేదంటే అవసరం లేదంటారా?





















