Twitter Bird Logo Auction: ట్విట్టర్ నీలి రంగు పక్షి లోగో వేలం - లక్షలు పెట్టి కొన్న అజ్ఞాత వ్యక్తి
Twitter Iconic Bird Logo At Auction: నీలి రంగు పక్షి లోగోను వేలం వేసినట్లు, మంచి ధర పలికినట్లు వేలం కంపెనీకి PR ధృవీకరించారు. కొనుగోలుదారు గుర్తింపును మాత్రం వెల్లడించలేదు.

Twitter Iconic Bird Logo Auction: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేసి, ఆ కంపెనీ పేరును ఎక్స్ (X) అని మార్చినప్పటికీ, యూజర్లు ట్విట్టర్ పేరును & దాని గుర్తింపుగా ఉన్న నీలిరంగు పక్షి (Twitter's iconic bird logo)ను ఇప్పటికీ మరిచిపోలేదు. ఫ్రెష్ అప్‌డేట్ ప్రకారం, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన 'ట్విట్టర్ ఐకానిక్ బర్డ్ లోగో' వేలం జరిగింది. ఈ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోను ‘ఆర్‌ఆర్ ఆక్షన్’ (R R Auction) కంపెనీ వేలం వేసింది. ఆ వేలంలో, ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో (Twitter Blue Bird Logo Auction) 34,375 డాలర్లకు అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో ఈ విలువ దాదాపు 30 లక్షల రూపాయలు.
ట్విట్టర్ నీలి రంగు పక్షి చిహ్నం 34 వేల 375 డాలర్లకు వేలం జరిగినట్లు ‘ఆర్‌ఆర్ ఆక్షన్’ సంస్థ అధికారికంగా ధృవీకరించింది. మంచి ధర పలికిందని ఆక్షన్ కంపెనీ తెలిపింది. అయితే, కొనుగోలుదారు పేరు సహా ఇతర ఏ వివరాలను ఆ కంపెనీ వెల్లడించలేదు. ట్విట్టర్ పక్షి చిహ్నాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి అభ్యర్థన మేరకే ఆయన వివరాలు వెల్లడించడం లేదని ‘ఆర్‌ఆర్ ఆక్షన్’ సంస్థ తెలిపింది.
బ్లూ బర్డ్ లోగో ఇలా ఉంటుంది
శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో దాదాపు 254 కిలోల బరువు ఉంటుంది. 12 అడుగుల (3.7 మీటర్లు) పొడవు & 9 అడుగుల (2.7 మీటర్లు) వెడల్పు ఉంటుంది. ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ కంపెనీని కొనకముందు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ఈ పక్షి బొమ్మ వెలిగిపోయేది. మస్క్ మామ ట్విట్టర్ పేరును X గా మార్చిన తర్వాత ఈ లోగో కళావిహీనమైంది. ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత, ఆ కంపెనీ గుర్తుగా ఉండే చాలా వస్తువులను ఎలాన్ మస్క్ గతంలోనూ వేలం వేయించారు.
2022 అక్టోబర్‌లో ట్విట్టర్ పిట్టను కొన్న మస్క్
ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి టెస్లా CEO, ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. 2022 అక్టోబర్‌లో ఈ డీల్ పూర్తయింది, ట్విట్టర్ పిట్ట ఎలాన్ మస్క్ చేతికి దొరికింది. ట్విటర్‌ను 'ప్రతిదీ ఉండే యాప్' (everything app)గా మార్చాలన్నది ఎలాన్ మస్క్ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే ట్విట్టర్ పేరును మార్చారు, దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. సబ్‌స్క్రిప్షన్ ప్రవేశపెట్టడం సహా కంటెంట్ విషయంలోనూ అనేక మార్పులు చేశారు.
వేలానికి వచ్చిన ఇతర వస్తువులు
ట్విట్టర్ నీలి పక్షిని వేలం వేసిన ‘ఆర్‌ఆర్ ఆక్షన్’ కంపెనీ, అదే బిడ్డింగ్ కార్యక్రమంలో, ఇతర కంపెనీలకు చెందిన కొన్ని వస్తువులను కూడా వేలానికి పెట్టింది. ఈ వేలంలో... ఆపిల్-1 కంప్యూటర్ దాదాపు రూ. 3.22 కోట్లకు (3.75 లక్షల డాలర్లు) అమ్ముడైంది. స్టీల్ జాబ్స్ సంతకం చేసిన ఆపిల్ చెక్ దాదాపు రూ. 96.3 లక్షలకు (1,12,054 డాలర్లు) అమ్ముడైంది. సీల్డ్ ప్యాకింగ్‌లో ఉన్న మొదటి తరం 4 GB ఐఫోన్ 87,514 డాలర్లకు అమ్ముడైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

