Amazon Additional Charges: ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేస్తున్న అమెజాన్, ఆర్డర్ చేసే ముందు చూసుకోండి
Amazon Processing Fee: ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్, ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.49 వసూలు చేస్తోంది. మరో ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ కూడా దీనిని తీసుకుంటోంది.

Amazon Charges Rs 49 Processing Fee: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ప్రజల జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చాయి. మార్కెట్‌కు వెళ్లి షాపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సమయాన్ని ఆదా చేస్తున్నాయి, శ్రమను తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌లో వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్‌లు కూడా అందిస్తున్నాయి. మన దేశంలో, కోట్లాది స్మార్ట్ ఫోన్‌లలో ఈ యాప్‌లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
అమెజాన్ ప్రాసెసింగ్ ఫీజ్
ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయిన అమెజాన్, కొత్తగా ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేయడం ప్రారంభించింది. ఉత్పత్తులను ఆర్డర్ చేసినప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ పేరిట 49 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అయితే, అన్ని ఆర్డర్లకు ఈ డబ్బులు వసూలు చేయడం లేదు, "ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్" (IBD) ఉపయోగించే కొనుగోళ్లకు మాత్రమే వసూలు చేస్తోంది. అది కూడా, , "ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్" రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రాసెసింగ్ ఫీజ్ పేరిట 49 రూపాయలు తీసుకుంటోంది. అంటే.. మీరు రూ.500 మించి బ్యాంక్ డిస్కౌంట్‌లో ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు ఈ అదనపు ఛార్జీ చెల్లించాలని గుర్తుంచుకోండి. రూ. 500 కంటే తక్కువ డిస్కౌంట్ ఉన్న సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే వసూలు
ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart processing fee) కూడా చాలాకాలంగా తన కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేస్తోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బాటలోకే అమెజాన్ కూడా నడుస్తోంది.
ప్రాసెసింగ్ ఫీజ్ ఎలా పని చేస్తుంది?
ఉదాహరణకు, మీరు అమెజాన్ ఫ్లాట్‌ఫామ్‌లో రూ. 5,000 విలువైన వస్తువును కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఆ వస్తువు మీద బ్యాంక్ మీకు 10% డిస్కౌంట్ ఇస్తుందని అనుకుందాం. ఈ సందర్భంలో, డిస్కౌంట్ 10% అంటే రూ. 500 అవుతుంది. అంటే, మీరు కొనబోయే రూ. 5,000 వస్తువుపై రూ. 500 డిస్కౌంట్ పోను మీరు రూ. 4,500 చెల్లించాలి. ఇప్పుడు, మీరు చెల్లించాల్సిన మొత్తానికి అమెజాన్ రూ. 49 ప్రాసెసింగ్ ఫీజ్‌ను కూడా యాడ్ చేస్తుంది. మీరు చెల్లించాల్సిన తుది మొత్తం రూ. 4,549 అవుతుంది.
ప్రాసెసింగ్ రుసుమును ఎవరు చెల్లించాలి?
* రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (IBD)ను ఉపయోగించుకునే యూజర్లంతా.
* ప్రైమ్ మెంబర్లకు మినహాయింపు లేదు, ఈ ఫీజ్ వాళ్లకు కూడా వర్తిస్తుంది.
* IBD రూ. 500 కంటే తక్కువగా ఉంటే, మీ ఆర్డర్‌కు ఈ రుసుము వర్తించదు.
ఆర్డర్‌ను రద్దు చేస్తే లేదా రిటర్న్ చేస్తే ప్రాసెసింగ్ ఫీజ్ తిరిగి వస్తుందా?
రాదు. మీరు ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసినా లేదా రిటర్న్ చేసినా, అప్పటికే మీరు చెల్లించిన రూ. 49 రుసుము మీకు తిరిగి రాదు. ఇది నాన్-రిఫండబుల్ అమౌంట్.
అమెజాన్ ఎందుకు రుసుము వసూలు చేస్తోంది?
బ్యాంకు ఆఫర్లను నిర్వహించడానికి & ప్రాసెస్ చేయడం కోసం అయ్యే ఖర్చును కవర్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజ్ ఉపయోగపడుతుందని అమెజాన్ చెబుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి ఒక సర్వీస్ ఛార్జ్ లాంటిది ఇof.
ముందే గమనించడం మంచిది
అమెజాన్ రూ.49 ప్రాసెసింగ్ ఫీజ్ వసూలు చేస్తోంది కాబట్టి, మీరు చెక్ అవుట్ చేసే ముందే మీ డిస్కౌంట్‌ను పూర్తిగా పరిశీలించాలి & రూ. 49 రుసుము వర్తిస్తుందో లేదో చూసుకోవాలి. మీ డిస్కౌంట్ రూ. 500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటే, ఈ అదనపు ఛార్జీ నుంచి తప్పించుకోవడానికి మీ కార్ట్‌ను సర్దుబాటు చేయవచ్చా అని మరోసారి చెక్ చేయడం వల్ల మీకు డబ్బు ఆదా కావచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

