Delimitation JAC Meeting in Chennai: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు- చెన్నై సమావేశంలో 7 తీర్మానాలు ఆమోదించిన పార్టీలు
Fair Delimitation Meet In Chennai:పాతికేళ్ల వరకు డీలిమిటేషన్ జోలికి వెళ్లొద్దనికి కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. చెన్నైలో సమావేశమైన పార్టీలు 7 తీర్మానాలు ఆమోదించాయి.

Delimitation JAC Meeting in Chennai: కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెన్నైలో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు తీర్మానించాయి. ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి జనాభాప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌తో కొన్ని రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని భావించాయి. అందుకే పాతికేళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చేసిన కొన్ని తీర్మానాలను సమావేశానికి హాజరైన నేతలు చర్చించి ఆమోదించాయి.
కేంద్రం చేపట్టే చర్యలపై పోరాటానికి ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్ణయించారు. వివిధ పరిస్థితులు కారణంగా వివిధ పార్టీలు సమావేశానికి రాలేకపోయాయని నేతలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ కూడా కూడా ఈ సమావేశానికి రాలేకపోయిందని అన్నారు. ఆ పార్టీ తమతోనే ఉందని ఎంపీ కనిమొళి ప్రకటించారు. వచ్చే సమావేశానికి ఆ పార్టీ కచ్చితంగా వస్తుందని అభిప్రాయపడ్డారు.
రెండో సమావేశం హైదరాబాద్‌లో పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. మిగతా నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వద్దామని ఆయనకు స్టాలిన్ సూచించారు. జేఏసీని ఎవరు లీడ్ చేయాలనే వాటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని నేతలు తెలిపారు.
ఈ సమావేశంలో మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్... ప్రస్తుతం చేస్తున్న పోరటాన్ని "జాతీయ ఉద్యమం"గా అభివర్ణించారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడున్న అంచనాల ప్రకారం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. జనాభా నియంత్రణలో విజయం సాధించడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అధిక జనాభా పెరుగుదల ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పొందుతాయని తెలిపారు.
ప్రస్తుతం చేస్తున్న పోరాటం డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు స్టాలిన్. అన్యాయంగా దానిని అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అవసరమైతే కేంద్రం చేప్టటే ప్రక్రియను న్యాయపరంగా సవాల్ చేసేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి ఒక న్యాయ నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. హక్కుల పోరాటంలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదని తెలిపారు.
ఏడు అంశాల తీర్మానం విడుదల
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైనా డీలిమిటేషన్ ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు పారదర్శకంగా నిర్వహించాలి. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర భాగస్వాములతో చర్చించాలి. సహకరించే వీలుగా వాళ్లను ఒప్పించాలి అని తీర్మానంలో పేర్కొన్నారు. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు శిక్ష వేయకూడదు. దీని కోసం కేంద్రం రాజ్యాంగ సవరణలు చేయాలి. లాంటి 7 తీర్మానాలు ఆమోదించాయి పార్టీలు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ డీలిమిటేషన్ ప్రతిపాదనను "డమోక్లెస్ కత్తి"తో పోల్చారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ లాభాపేక్షతో ఎజెండా రూపొందిస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని, దీనివల్ల పార్లమెంటులో అసమతుల్యత ఏర్పడుతుందని విజయన్ హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కేందుకే డీలిమిటేషన్ ప్రణాళిక అమలుకు బీజేపీ ఉత్సాహపడుతోందన్నారు రేవంత్ రెడ్డి. దక్షిణాది ప్రజలను "ద్వితీయ పౌరులుగా" మారుస్తుందని ఆరోపించారు. "జనాభా ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహిస్తే, దక్షిణ భారతదేశం తన రాజకీయ స్వరాన్ని కోల్పోతుంది. దీన్ని తాము అంగీకరించం" అని ఆయన అన్నారు. లోక్‌సభ సీట్ల పెంపును వ్యతిరేకించారు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ తోడ్పాటు అందిస్తున్నా తక్కువ ఆర్థిక కేటాయింపులు పొందుతున్నాయని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

