GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
Telangana High Court: జీహెచ్ఎంసీని 300 వార్డులు చేస్తూ ఇచ్చిన డీలిమిటేషన్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించిది. పిటిషన్లను కొట్టివేసింది.

GHMC delimitation : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను 300 డివిజన్లను పెంచడంపై దాఖలైన 80 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అభ్యంతరాలు తెలిపేందుకు ఇచ్చిన గడువు ముగిసిందని హైకోర్టు గుర్తు చేసింది. దీంతో ప్రభుత్వం గ్రేటర్ ను 300 వార్డులుగా విభజించడానికి అడ్డంకులు తొలగిపోయినట్లయింది.
27 మున్సిపాలిటీల విలీనం తర్వాత 300వార్డులకు జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరిస్తూ, వార్డుల సంఖ్యను 150 నుండి 300కు పెంచుతూ ప్రభుత్వం డీలిమిటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, తొలుత 300 వార్డుల జనాభా వివరాలు, మ్యాప్‌లను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించారు. అయితే, దీనిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడంతో డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. కేవలం పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన వార్డులు ముఖ్యంగా వార్డు నెం. 104 - షా అలీ బండా, 134 - లంగర్ హౌజ్ వివరాలు మాత్రమే బహిర్గతం చేయాలని స్పష్టం చేసింది.
అనేక అభ్యంతరాలతో పిటిషన్లు - కొట్టేసిన హైకోర్టు
వార్డుల విభజనపై ప్రజలు తమ అభ్యంతరాలను సమర్పించడానికి హైకోర్టు అదనపు సమయం కేటాయించింది. తొలుత డిసెంబర్ 17తో ముగియాల్సిన గడువును కోర్టు డిసెంబర్ 19 వరకు పొడిగించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ డీలిమిటేషన్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం పరిమితంగా ఉండాలని వాదించారు. కేంద్ర సెన్సస్ కమిషనర్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 31, 2025 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, అందుకే వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశామని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్న ప్రభుత్వం
డీలిమిటేషన్ పై ప్రభుత్వానికి చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఒకే వార్డు రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వస్తోందని కొందరు ఫిర్యాదు చేశారు. కొన్ని వార్డుల్లో 18 వేల జనాభా ఉంటే, మరికొన్నింటిలో 70 వేల వరకు ఉండటంపై కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హయత్ నగర్ వంటి ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు ఒక వార్డులో, ఆ ప్రాంత పేరుతో ఉన్న మరో వార్డు వేరే చోట ఉండటంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తూనే, మరోవైపు కోర్టు కోరిన వార్డుల మ్యాప్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 31లోగా తుది నివేదిక సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దానికి సంబంధించి కోర్టు వద్ద అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లయింది.





















