Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Bondi Beach shooting: అస్ట్రేలియాలో బొండి బీచ్ లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్ మృతదేహాన్ని కూడా తాకబోనని ఆయన భార్య ప్రకటించారు. మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించారు.

Sajid Akram: సిడ్నీలోని ప్రఖ్యాత బొండి బీచ్ సమీపంలో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్ ఉదంతంలో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మరణించిన నిందితుడు సాజిద్ అక్రమ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని భార్య నిరాకరించింది. తన భర్త చేసిన అమానవీయ చర్యల పట్ల ఆగ్రహంతో ఉన్న ఆమె, అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, మృతదేహాన్ని కూడా తాకబోనని తెగేసి చెప్పింది.
కొద్దిరోజుల క్రితం బొండి బీచ్ లో సాజిద్ అక్రమ్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి భీభత్సం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయగా, అతను ఎదురుతిరగడంతో జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మరణించాడు. సాజిద్ అక్రమ్ కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. అతని వేధింపులు, ప్రవర్తన నచ్చక ఆమె విడిపోయి జీవిస్తోంది. కాల్పుల ఘటన తర్వాత పోలీసులు ఆమెను సంప్రదించి, నిబంధనల ప్రకారం మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే అతను చేసిన పాపాల్లో నాకు భాగం లేదు, అతని ముఖం కూడా చూడాలనుకోవడం లేదు అని ఆమె స్పష్టం చేసింది.
సాజిద్ అక్రమ్ చేసిన దారుణం వల్ల తన కుటుంబం పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి ఆమె నిరాకరించడంతో, ఆస్ట్రేలియా అధికారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు వస్తారేమోనని చూస్తున్నారు, లేని పక్షంలో ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. సాజిద్ కుమారుడు కూడా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నాడు. ఆస్పత్రిలో ఉన్నాడు. అతనిపై పదిహేను డిగ్రీల మర్డర్ కేసులు పెట్టారు. మిగతా సాజిద్ బంధువులు హైదరాబాద్ లో ఉంటారు. అయితే వారు కూడా ఆ మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకుేన అవకాశాలు లేవు.
Sajid Akram, the 50-year-old Bondi Beach terrorist, was homeless and moving between Airbnbs across Sydney's southwest for six months before his attack. Even in death, his estranged wife wants nothing to do with him, putting burial plans in limbo. pic.twitter.com/VdHjsQra2n
— 7NEWS Sydney (@7NewsSydney) December 21, 2025
సాజిద్ అక్రమ్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలపై సిడ్నీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఏవైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేక మానసిక స్థితి సరిగా లేక ఇలా చేశాడా అనే కోణంలో విచారణ సాగుతోంది. ప్రస్తుతం అతని భార్య తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ఒక తీవ్రవాది పట్ల ఆమె చూపిన కఠిన వైఖరిని కొందరు సమర్థిస్తున్నారు.





















