Harish Rao: కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
KCR Vs Congress: కృష్ణా నీళ్ల విషయంలో కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. చిట్ చాట్‌లతో రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

Harish Rao: కేసీఆర్ లేవనెత్తిన ప్రాజెక్టుల అంశాలకు సమాధానం చెప్పలేక, రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ రాజకీయాలతో తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఒక స్టేట్స్ మన్ లాగా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి ఒక స్ట్రీట్ రౌడీ లాగా అత్యంత హీనమైన భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు.
కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్ వాపస్ తెచ్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టీఎంసీలు చాలు అని ఢిల్లీకి లేఖ ఎందుకు రాశారు ఇది పాలమూరు గొంతు కోయడం కాదా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు వంటి ప్రాజెక్టుల ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని, ఈ వాస్తవాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చలేరని హితవు పలికారు.
మహాలక్ష్మి పథకం కింద రూ. 2500, రైతు భరోసా, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఏమయ్యాయని హరీశ్ రావు ప్రశ్నించారు. నిధుల సమీకరణలో అనుభవం ఉందని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ అనుభవాన్ని కేవలం లూటీలకు, దోపిడీలకు మాత్రమే వాడుతున్నారని విమర్శించారు. బడ్జెట్‌లో లక్షల ఎకరాలకు ఆయకట్టు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిందా అని సవాల్ విసిరారు. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజుకు 10 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తుంటే, రేవంత్ సర్కారు చేష్టలుడిగి చూస్తోందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లమయమని, చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చే ఆయనకు నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని హరీశ్ రావు అన్నారు. 50 కోట్లు పెట్టి పీసీసీ పదవి కొన్నవని మీ పార్టీ నేతలే చెప్పారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రగతి గురించి టోనీ బ్లెయిర్ వంటి అంతర్జాతీయ ప్రతినిధులే ప్రశంసించారని, కానీ రేవంత్ మాత్రం రాజకీయాల కోసం రాష్ట్ర పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికైనా 45 టీఎంసీలు చాలు అన్న లేఖను వెనక్కి తీసుకొని, 90 టీఎంసీల కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జల ప్రయోజనాల విషయంలో కేసీఆర్ ఏనాడూ రాజీపడలేదని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.





















