Viral Note: 'నగలు డబ్బు తీసుకెళ్తున్నాం, మా ఇంటికి రాకండి' - సంక్రాంతికి ఊరెళ్తూ ఇంటి డోర్‌పై యజమాని నోట్ వైరల్
Hyderabad News: ఓ ఇంటి యజమాని ఏకంగా దొంగలకే షాక్ ఇచ్చాడు. పండుగకు ఊరెళ్తూ తన ఇంటి ముందు గేటుకు ఓ నోట్ అతికించి వెళ్లాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
House Owner Warning Note Post Viral: సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో స్థిరపడిన వారంతా పండుగ రోజుల్లో సరదాగా తమ ఫ్యామిలీతో గడిపేందుకు స్వగ్రామాలకు తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ వంటి నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. ఇదే అదునుగా కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండుగకు ఊరెళ్లే వారి ఇళ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, దొంగల బారి నుంచి కాపాడుకునేలా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. టెక్నాలజీని సైతం ఉపయోగించి సొంతూళ్లకు వెళ్లిన వారి ఇళ్లల్లో నిఘా వేస్తుంటారు. ఊరికి వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు చెబుతుంటారు. రాత్రి పూట ఆయా ప్రాంతాల్లో తమ సిబ్బందితో నిఘా తీవ్రం చేస్తారు.
ఇంటి గేటుకు పోస్టర్
ఈ క్రమంలోనే ఓ ఇంటి యజమాని రాసిన పోస్ట్ నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. 'మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి - ఇట్లు మీ శ్రేయోభిలాషి.' అనేది ఆ నోట్ సారాంశం. దీన్ని ఇంటి బయట డోర్‌కు అంటించి వెళ్లారు. దీన్ని చూసిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు సైతం తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి యజమాని కొత్తగా ఆలోచించారని ఒకరు.. ఏకంగా దొంగలకే షాక్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి