Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై ప్రభుత్వానికి నివేదిక.. నెక్ట్స్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పై చర్యలు !
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని విజిలెన్స్ తుది నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్ సమర్పించింది.

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమని నివేదిక తేల్చింది. ఈ మేరకు 257 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి విజిలెన్స్ సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.. బ్యారేజీ నిర్మాణంలో కీలకమైన సీకెంట్ పైల్స్ వేయడంలో తీవ్ర లోపం జరిగిందని పేర్కొంది.ప్రైమరీ పైల్స్ వేసిన ఒకట్రెండు రోజుల్లో ఆర్‌సీసీ సీకెంట్ పైల్స్ వేయాల్సి ఉండగా.. నెల నుంచి నెలన్నర తర్వాత వేశారు. సీకెంట్ పైల్స్ ఎలా వేయాలన్నదానిపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ-పీఈఎస్ తమ అంతర్గత డాక్యుమెంట్‌నే అమలు చేయలేదు.
నీటిపారుదల శాఖకు చెందిన ఫీల్డ్ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఫీల్డ్ ఇంజినీర్లకు సీకెంట్ పైల్స్ గురించి అవగాహన లేదు. దీని మీద ఉన్నతస్థాయి ఇంజినీర్లు పర్యవేక్షణ చేయలేదు.సీడీవో ఆమోదించిన డ్రాయింగులను అమలు చేయలేదు. లోపభూయిష్ఠ నిర్మాణం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సీకెంట్ పైల్స్ నిర్మాణంలో లోపం వల్ల రాఫ్ట్ కింద పైపింగ్ ఏర్పడి గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే అంతిమంగా ఏడో బ్లాక్ కుంగింది.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం
బ్యారేజీ కుంగడానికి నిర్మాణ సంస్థ చర్యలు కూడా కారణమని విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడానికి కారణమైందని భావిస్తున్నారు. 2021 డ్యాం సేఫ్టీ చట్టం, పీడీపీపీ చట్టం-1984, పీసీ యాక్టు-1988, ఐపీసీలోని 120(బీ), 336, 409, 418, 423, 426 ప్రకారం సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాకు స్థానంలో కొత్తది నిర్మించడానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచి వసూలు చేయాలని సూచించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేసిన 17 మంది ఇంజినీర్లపైనా ఈ చట్టాల ప్రకారమే చర్య తీసుకోవాలని సూచించింది.
పని పూర్తికాకుండానే సర్టిఫికెట్
ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఇంజనీర్లు చేశారు. పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యారేజీకి మరమ్మతులు చేయకున్నా పట్టించుకోకపోవడం ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థ కలిసి ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది. పరిపాలనా అనుమతి ఇచ్చిన దానికన్నా డీవియేషన్ అదనంగా పెరిగితే 15 శాతం వరకు ప్రభుత్వానికి సమాచారమిచ్చి చీఫ్ ఇంజినీరే సవరించిన సాంకేతిక అనుమతి ఇవ్వొచ్చు. అయితే మొదటిసారి సవరించిన అంచనా ఆమోదం పొందకముందే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా చీఫ్ ఇంజినీర్ 15 శాతం డీవియేషన్‌కు ఆమోదం తెలిపారు. మొదట సవరించి ఇచ్చిన అంచనాలో ఉన్న కొన్ని పనులు చేయలేదు.అయితే అంచనాలో లేని పనులను చేసి బిల్లులు పొందారు. కొన్ని మంజూరు చేసిన క్వాంటిటీస్ కన్నా ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారు. రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌కు చీఫ్ ఇంజినీర్ ఆమోదం తెలిపారు. 2018 జూన్ 23న రూ.3,260 కోట్ల సవరించిన అంచనాకు ఆమోదం రాగా, అంతకుముందే 2018 జూన్ 14న రూ.1,343.76 కోట్ల డీవియేషన్‌ను చీఫ్ ఇంజినీర్ ఆమోదించారు. క్వాలిటీ కంట్రోల్‌కు సంబంధించి 1,88,257 క్యూబిక్ మీటర్ల టెస్ట్ రిజిస్టర్లు లేవు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయి.
కాఫర్‌డ్యాం దుర్వినియోగం
కాఫర్‌డ్యాం నిర్మాణానికి అంచనా వ్యయం తొలుత రూ.12.95 కోట్లు ఉండగా, 2018 జూన్ 23న మొదట సవరించిన అంచనాలో రూ.11.64 కోట్లకు తగ్గింది. రెండోసారి సవరించిన అంచనాలో రూ.61.21 కోట్లకు చేరింది. కాఫర్‌డ్యాంకు సంబంధించిన వివరాలు ఎక్కడా నమోదు చేయలేదు. విజిలెన్స్ రికార్డులు సీజ్ చేసే సమయంలో ఎంబీ-23, పేజీ-11లో పొందుపరిచారు. తర్వాత రికార్డు చేసిన 46,851 క్యూబిక్ మీటర్ల పనిని రద్దు చేశారు.బ్యారేజీ ప్రారంభం జరిగిన తర్వాత కాఫర్‌డ్యాం వ్యయాన్ని భారీగా పెంచి సవరించిన రెండో అంచనాను ఆమోదించడం నిధులను దుర్వినియోగం చేయడం, కాంట్రాక్టర్‌కు అయాచిత ప్రయోజనం కలిగించడానికేనని స్పష్టం చేసింది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన లోపాలు, అక్రమాలకు కాంట్రాక్టు సంస్థ, ఇంజినీర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

