Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
India statement on Iran War | బడ్జెట్ సమావేశాలు రెండవ దశలో విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్ము గల్ఫ్ దేశాల నేతలతో చర్చించారని తెలిపారు.

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా పరిస్థితిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రాజ్యసభలో స్పందించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన పరిణామాలు అందరికీ ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్, మిస్సైల్ దాడులు చేస్తుంటే.. మరోవైపు ఇరాన్ ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఫిబ్రవరి 28 నుంచి అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, చాలా మంది ప్రాణనష్టం జరిగిందని జైశంకర్ వివరించారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఆయా దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు భద్రత కల్పిస్తామని, వారిని క్షేమంగా తిరిగి తీసుకొస్తామని రాజ్యసభలో మరోసారి స్పష్టం చేశారు.
CCS సమావేశంలో ఇరాన్ యుద్ధంపై చర్చ
'కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం మార్చి 1న జరిగింది. ఇందులో ఇరాన్ పై ఇతర దేశాల దాడులు.. తదనంతరం జరిగిన ఎదురు దాడులపై చర్చించాం. సమావేశంలో ప్రాంతీయ భద్రత, ఆర్థిక ప్రభావంపై కూడా దృష్టి సారించాం. అన్ని మంత్రిత్వ శాఖలకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగడం భారత్‌కు చాలా ఆందోళన కలిగించే విషయం. గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారత పౌరులు నివసిస్తున్నారు. లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇరాన్ లో కూడా చాలా మంది భారతీయులు చదువుకునేందుకు, ఉపాధి నిమిత్తం వెళ్లారు. త్వరలో సప్లై ఛైన్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మర్చంట్ నేవీ నౌకపై దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు భారతీయులు చనిపోగా, ఒకరు గల్లంతయ్యారని’ ఎస్ జైశంకర్ రాజ్యసభలో పేర్కొన్నారు.
ఇరాన్‌లోని భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహా జారీ
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై కేంద్రం ప్రభుత్వం చర్యలపై ఎస్. జైశంకర్ స్పందించారు. తమ ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోందని, ప్రస్తుతం కొంతకాలం ఇరాన్‌కు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది. భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్న మన పౌరులను కోరుతున్నాం.
భారత పౌరుల భద్రత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని జైశంకర్ స్పష్టం చేశారు. భారతీయుల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని సంబంధిత దేశాలతో చర్చలు జరుపుతోందని, పరిస్థితి త్వరలో సాధారణ స్థితికి వస్తుందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ దశ మొదటి రోజున ఈ ప్రకటన వచ్చింది, ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. చర్చలు, దౌత్య మార్గాన్ని అనుసరించాలని జైశంకర్ అన్ని పార్టీలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు




















