Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
AP CM Politics: చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారని లోకేష్ ను సీఎం చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ సీఎం కావొచ్చని చెబుతున్నారు. కూటమి పార్టీల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది?

Lokesh vs Pawan Race: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అంతా సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా, తెరవెనుక జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం మాత్రం పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, రాష్ట్ర పగ్గాలను తనయుడు లోకేష్‌కో లేదా మిత్రపక్ష నాయకుడు పవన్ కల్యాణ్‌కో అప్పగిస్తారనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
వ్యూహాత్మక అడుగులు
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు కీలక మద్దతుదారుగా ఉండటంతో, ఆయనకు ఢిల్లీలో సముచిత స్థానం దక్కుతుందనేది కొందరి అంచనా. ఒకవేళ బాబు జాతీయ రాజకీయాలకు షిఫ్ట్ అయితే, రాష్ట్రంలో కొత్త నాయకత్వం అనివార్యమవుతుంది. అయితే, టీడీపీకి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నందున, సహజంగానే చంద్రబాబు తన వారసుడిగా నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని భావిస్తారు. ఇప్పటికే లోకేష్ పరిపాలనలో చురుగ్గా ఉంటూ తనదైన ముద్ర వేస్తుండటం ఈ వాదనకు బలాన్నిస్తోంది.
పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్
మరోవైపు, పవన్ కల్యాణ్ సీఎం కావాలనే డిమాండ్ ఆయన అభిమానుల నుంచే కాకుండా, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వంటి వారి వ్యాఖ్యల ద్వారా కూడా చర్చకు వస్తోంది. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అన్న సూత్రాన్ని నమ్మేవారు పవన్ సీఎం అయ్యే అవకాశాలను కొట్టిపారేయడం లేదు. కూటమి గెలుపులో పవన్ పోషించిన కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు అవకాశం ఇస్తారా? అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే, ఇది జరగాలంటే టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు, ఆ పార్టీ అంతర్గత అంగీకారం తప్పనిసరి. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నేత రాష్ట్రం నుంచి తప్పుకుంటే కూటమిలో నాయకత్వ సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక , అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలంటే బాబు అనుభవం అత్యవసరం. కేవలం వారసత్వం కోసమో లేదా మిత్రపక్షాల కోసమో సీఎం పదవిని వదులుకోవడం అంత సులభమైన నిర్ణయం కాకపోవచ్చు. లోకేష్ మరియు పవన్ మధ్య అధికార పంపిణీ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా అది కూటమి భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు.
చర్చ అంతా సోషల్ మీడియాలోనే !
అసలు కూటమి పార్టీల మధ్య ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి చర్చ జరగకపోయినా, ప్రతిపక్షాల విమర్శలు, సోషల్ మీడియా విశ్లేషణలు ప్రజల్లో అయోమయాన్ని కలిగిస్తున్నాయి. బాబు ఢిల్లీకి వెళ్తారా? లోకేష్‌కి పట్టాభిషేకం చేస్తారా? లేక పవన్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి కింగ్ మేకర్‌గా నిలుస్తారా? అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, ఈ సీఎం కుర్చీ వార్తలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త రకమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















