Justice Yashwant Varma: ఆ డబ్బు మాది కాదు.. నా ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం: జస్టిస్ యశ్వంత్ వర్మ
తన అధికారిక నివాసంలో భారీగా కరెన్సీ కట్టలు దొరికాయనే వార్తలను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తీవ్రంగా ఖండించారు.తాను కానీ, తన కుటుంబసభ్యులు ఎవరూ స్టోర్‌రూమ్‌లో నగదు ఉంచలేదని పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా కరెన్సీ కట్టలు దొరికాయనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని యశ్వంత్ వర్మ తీవ్రంగా ఖండించారు. తాను కానీ, తన కుటుంబసభ్యులు ఎవరూ స్టోర్‌రూమ్‌లో నగదు ఉంచలేదని పేర్కొన్నారు. తనను ఇరికించి, అపఖ్యాతి పాలయ్యేలా చేయడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు.
మార్చి 14న హోలీ వేడుకల సందర్భంగా రాత్రి 11:35 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని వార్తలు గుప్పుమన్నాయి. కాలిపోయిన నోట్ల కట్టలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. దీనిపై ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి డీకే శనివారం 25 పేజీల నివేదికను సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్ట చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఆ నివేదికలో యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు ఉన్నాయి.
కాగా ఈ ఆరోపణలన్నీ కట్టుకథలని, తన ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రచురితమయ్యాయని, వాస్తవాలను ధ్రువీకరించడంలో మీడియా విఫలమైందని జస్టిస్ వర్మ విమర్శించారు. స్టోర్‌రూమ్‌లో డబ్బు ఉందనే విషయం తనకు తెలియదని పునరుద్ఘాటించారు. ‘నాకు లేదా నా కుటుంబసభ్యులకు నగదు గురించి ఎలాంటి అవగాహన లేదు. మాకు, ఆ డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రాత్రి అక్కడున్న నా కుటుంబసభ్యులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి నగదు లేదా కరెన్సీని ఎవరూ చూపించలేదు’ అని జస్టిస్ వర్మ అన్నారు. స్టోర్ రూమ్ నుంచి తాను లేదా తన కుటుంబం కరెన్సీని తీసివేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
స్టోర్‌రూమ్‌ను సాధారణంగా తాను ఉపయోగించని.. ఫర్నీచర్, సీసాలు, టపాకాయలు, పరుపులు, కార్పెట్లు, స్పీకర్లు, తోట పనిముట్లు లాంటి వస్తువులను ఉంచడానికి ఉపయోగించేవారని యశ్వంత్ వర్మ చెప్పారు. ‘స్టోర్‌రూమ్‌కు అన్‌లాక్ ఉంది. సిబ్బంది క్వార్టర్స్ ముందు ద్వారం, వెనుక తలుపు రెండింటి నుంచి యాక్సెస్ చేయవచ్చు. స్టోర్ రూమ్‌కు, ప్రధాన నివాసానికి ఎలాంటి కనెక్టివిటీ లేదు. ఆ స్టోర్ రూమ్ నా ఇంట్లో భాగం కాదు’ అని ఆయన అన్నారు.
సంఘటన జరిగిన రాత్రి, తాను, తన భార్య మధ్యప్రదేశ్‌లో ఉన్నామని, తమ కుమార్తెతోపాటు వృద్ధ తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మార్చి 15న భోపాల్ నుంచి ఇండిగో విమానంలో ఢిల్లీకి తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. మంటలు చెలరేగినప్పుడు తమ కుమార్తె, ప్రైవేట్ కార్యదర్శి వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారని, వారు చేసిన కాల్స్ కూడా రికార్డ్ అయ్యాయని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా తమ ఇంటి సభ్యులు, సిబ్బందిని అక్కడి నుంచి తరలించారని, మంటలు ఆర్పిన తర్వాత, ఆ ప్రదేశంలో నగదు లేదా కరెన్సీ కనిపించలేదు అని జస్టిస్ చెప్పుకొచ్చారు.
స్టోర్‌రూమ్ తమ నివాస గృహాల నుంచి పూర్తిగా విడిగా ఉన్న గది. మధ్యలో గోడ కూడా ఉంది. మీడియా పరువు నష్టం కలిగించే ఆరోపణలను ప్రచురించే ముందు సరైన విచారణ నిర్వహించి ఉంటే బాగుండు" అని యశ్వంత్ వర్మ అసహనం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

