Virat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam
ఐపీఎల్ మొదలై 17ఏళ్లు గడిచిపోయాయి. ఇది 18వ సీజన్. కానీ ఇన్ని సీజన్లలో ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నా విరాట్ కొహ్లీకి...ఆర్సీబీ కప్పు కల కలగానే మిగిలిపోయింది. చాలా సార్లు ప్లే ఆఫ్ అవకాశాల్లో పోరాడినా...ఫైనల్లో రక్తం చిందించేలా ప్రదర్శనలు ఇచ్చినా ఎందుకో కప్పు మాత్రం కొహ్లీ చేతులను తాకలేకపోయింది. ఆర్సీబీ కి ఉన్న లోయల్ ఫ్యాన్ బేస్ వల్ల 18వ సీజన్ లో కూడా వాళ్లు ఈ సాలా కప్ నమ్మదే అంటూ సపోర్ట్ గా ఉంటున్నారు కానీ అమ్మో కప్పు లేకుండా ఇన్నేళ్ల ఎదురుచూపులు అంటే అది మామూలు విషయం కాదు. అయితే 18వ సీజన్ ఇనాగ్యురల్ మ్యాచ్ లో నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ విధ్వంసమే చేసింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 22 బంతులు ఉండగానే ఛేజ్ చేసి...7వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ కోల్ కతా బౌలర్లను ర్యాంపాడించారు. సాల్ట్ దూకుడుగా ఆడి అర్థ శతకం బాదితే..విరాట్ కొహ్లీ చాలా బ్యాలెన్స్డ్ గా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ వికెట్ల మధ్య చిరుతపులిలా పరిగెడుతూ డాకూ మహారాజ్ బీజీఎంతో వింటేజ్ విరాట్ ను గుర్తు చేస్తూ వేటాడాడు. విరాట్ చూపించిన ఈ కసి, పట్టుదల కు కారణం కనీసం 18వ ప్రయత్నంలోనైనా కప్పు కొట్టాలని. కొహ్లీ తపనను కాసేపు పక్కన పెడితే ఈసారి కప్ మాదే అనటానికి ఫ్యాన్స్ మాత్రం వింత వింత థియరీలు చెబుతున్నారు. 18అనేది లక్కీ నెంబర్ అంట. విరాట్ కొహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కాబట్టి ఈసారి 18వ సీజన్ లో..18వ ప్రయత్నంలో విరాట్ కొహ్లీ కి కప్పు రావటం ఖాయం..కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రజత్ పాటిదార్ కొహ్లీ 18ఏళ్ల కష్టానికి గుర్తుగా పెద్ద గిఫ్టు ఇవ్వటం ఖాయం అని చెప్తున్నారు. ఇంకో విచిత్రమైన థియరీ ఏంటంటే..మహ్మద్ గజినీ. చరిత్రలో మహ్మద్ గజినీ అనే టర్కీ మహారాజు భారత దేశాన్ని తన హస్తగతం చేసుకోవాలని 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య ఏకంగా 17సార్లు దండయాత్ర చేశాడు. ప్రతీసారి ఓడిపోవటం మళ్లీ శక్తినంతా కూడదీసుకుని యుద్ధానికి రావటం అనేది పరిపాటి అయ్యిపోయింది. అలా 18వ తన ఆఖరి ప్రయత్నంలో మహ్మద్ గజినీ విజయం సాధించాడట. మనదేశంపై యుద్ధం గెలవటం మనకు అంత మంచి విషయం కాకపోయినా...ఓటమిని ఒప్పుకోకుండా పోరాడుతూనే ఉండాలనే దానికి ఉదాహరణగా మహ్మద్ గజినీని ఈ రోజుకు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొహ్లీ కూడా అంతే అచ్చం మహ్మద్ గజినీలానే 17సార్లు దండయాత్ర చేశాడు..ఫలితం దక్కలేదు. ఓటమిని ఒప్పుకోకుండా ఈ 18వసారి దండయాత్ర చేసి ఘన విజయం సాధిస్తాడని..ఈసాలా కప్ వాళ్లదేనని ఆర్సీబీ ఫ్యాన్స్ బలంగా విశ్వసిస్తున్నారు.





















