Sabarimala Ayyappa 2024 : శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
Sabarimala Vanayatra: మండల దీక్ష తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకునే భక్తులు ఎక్కువ మంది రెండు మార్గాలను అనుసరిస్తారు. మొదటిది పెదపాదం, రెండోది చినపాదం. ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం ఏంటి..
Sabarimala
'ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం
అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం'
అంటూ స్వామిని దర్శించుకుని మురిసిపోతారు అయ్యప్ప మాలధారులు. అక్కడివరకూ చేరుకోవాలంటే వనయాత్ర చేయాలి. మండలకాలంపాటూ సాగే అయ్యప్ప దీక్ష జీవన సన్మార్గానికి బాటలు వేస్తుంది. కఠోర దీక్ష చేపట్టి ఇరుమడి తలపై పెట్టుకుని పదునెట్టాంబడి ఎక్కి ఆ స్వామిని దర్శించుకున్న జన్మ ధన్యం అని భావిస్తారు భక్తులు.
అయ్యప్ప దీక్షలో అతి ముఖ్యమైన ఘట్టం వనయాత్ర. అయ్యప్ప సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైంది. ఇరుముడిని తలపై పెట్టుకుని
‘కల్లుం ముల్లుం కాలికి మెత్తై .. స్వామియే శరణం అయ్యప్ప ’ అంటూ ఉత్సాహంగా సాగుతుంది వనయాత్ర
పుణ్య నదుల్లో స్నానం ఆచరించి...దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ ఏదో తెలియని శక్తితో ముందుకు సాగిపోతారు. ఇది సాక్షాత్తూ అయ్యప్పస్వామి నడిచివెళ్లిన మార్గం అని చెబుతారు..
అయ్యప్ప మాల ధరించిన స్వాములు శబరిమల దర్శనంకోసం పెదపాదం మార్గంలో కొందరు..చినపాదం మార్గంలో మరికొందరు వెళతారు. ఇంతకీ పెదపాదం - చినపాదం అంటే ఏంటి? ఎలా చేరుకోవాలి? జీవితకాలంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలని ఎందుకు చెబుతారు?
Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
మండల- మకర విళక్కు సందర్భంగా అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. నిత్యం భక్తులు సందడి సాగుతోంది. డిసెంబరు 26 వరకూ మండల మకర విళక్కు జరుగుతుంది. మూడు రోజుల పాటూ స్వామి సన్నిధిని మూసివేసి తిరిగి డిసెంబరు 29న తెరుస్తారు. ఏటా జనవరి 15న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 18 మెట్లు ఎక్కిన తర్వాత అయ్యప్ప స్వామి జ్యోతిగా మారి అంతర్థానమయ్యారని భక్తుల విశ్వాసం..అందుకే ఈ జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తుతారు.
పూర్తిస్థాయిలో యాత్ర చేయాలి అనుకుంటే శబరిమల యాత్ర చాలా కష్టంతో కూడుకున్నది. ఎరుమేలి నుంచి ప్రారంభమయ్యే యాత్రలో భాగంగా కొండలు, అడవులు, రాళ్లు, రప్పలు దాటుకుని శబరిమల చేరుకుంటారు. పెదపాదం నుంచి కష్టతరంగా సాగే యాత్ర చినపాదం నుంచి కొంత సులువుగా ముగుస్తుంది.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
పెదపాదం అంటే..
పెదపాదం అంటేనే వనయాత్ర అని పిలుస్తారు. ఎరుమేలి దగ్గర ప్రారంభమయ్యే యాత్ర.. సుమారు 58 కిలోమీటర్ల దూరం కాలినడకన భక్తులు స్వామివారి సన్నిధి చేరుకుంటారు. అడవిగుండా సాగే పెదపాదం యాత్ర... రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది..ఎక్కడా రోడ్డు కనిపించదు. మధ్య మధ్యలో పక్షులు, జంతువులు, సెలయేర్లు, లోయలు కనిపిస్తాయి. ఈ దారి మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళితే ఆ అనుభూతే వేరు.
ఎరుమేలిలో ఉన్న వావర్ స్వామిని ( అయ్యప్ప స్నేహితుడు..అనంతరకాలంలో భక్తుడు) ముందుగా దర్శించుకుని అక్కడ పేటతుళ్లై అనే నత్యం ఆడతారు. పేటతుళ్లై తర్వాత ధర్మశాస్త్ర ఆలయంలో ధనుర్భాణధారియై అయ్యప్పను దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి భక్తుల వనయాత్ర మొదలవుతుంది.
శబరిమల చేరుకునేందుకు వనయాత్ర అత్యంత కష్టంగా సాగుతుంది. అప్పటి రోజుల్లో శబరిమల చేరుకునేందుకు వనయాత్రనే అనుసరించేవారు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని చినపాదం యాత్రను ప్రారంభించింది దేవస్థానం. అనంతరం కేరళ ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించింది.
ఈ ప్రాంతం మొత్తం ఎన్నో వన మూలికలు ఉంటాయి. నడక మార్గంలో ఆ మూలికల నుంచి వీచే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక్కసారైనా వనయాత్ర చేయాలంటారు. పెదపాదం మార్గంలో భాగంగా అళుదా నదినుంచి రెండు రాళ్లు తీసుకుని..ఆ రాళ్లను కళిద ముకుండ అనే ప్రదేశంలో వేస్తారు. ఈ మార్గంలో అన్నిటికన్నా కష్టమైన శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాన్ని దాటేందుకు స్వయంగా స్వామివారు సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ పెదపాదం మార్గం ఓపెన్ చేయరు. కేవలం మకరవిళక్కు సమయంలో ఓపెన్ చేసి...తిరిగి సంక్రాంతి తర్వాత జనవరి 20న పెదపాదం మార్గం మూసివేస్తారు.
చిన్న పాదం అంటే మూడున్నర నుంచి ఐదు కిలోమీటర్లు..
పెదపాదం మార్గంలో శబరిమల చేరుకోలేని వాళ్ళు చిన్న పాదాన్ని ఆశ్రయిస్తారు. పంబా దగ్గరున్న కన్నెమూల గణపతికి టెంకాయ సమర్పించి యాత్ర మొదలుపెడతారు. మొదటిసారి మాల వేసుకున్నవారు తీసుకొచ్చిన బాణాన్ని శరమ్ గుత్తి దగ్గర విడిచిపెడతారు. ఇక్కడ నుంచి సన్నిధానానికి చేరుకోవడం అత్యంత సులభం. కేవలం మూడున్నర నుంచి 4 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇరుముడి పట్టుకునే భక్తులకు మాత్రమే 18 మెట్లు ఎక్కే అవకాశం ఉంటుంది..