Inflation in India: జనవరిలో 5 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం - ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటుంది?
Retail Inflation: ధరాఘాతం నుంచి దేశంలోని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగింది. ఈ ఏడాది జనవరిలో చిల్లర ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

Retail Inflation In India In January 2025: దేశంలోని సామాన్య & మధ్య తరగతి ప్రజలకు 2025 సంవత్సరం నుంచి మంచి రోజులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, 01 ఫిబ్రవరి 2025న ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ (Union Budget 2025-26)లో, రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా మార్చి పెద్ద ఉపశమనం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులకు, 07 ఫిబ్రవరి 2025న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసి (RBI Repo Rate Cut By 25 bps) 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. తాజాగా, ద్రవ్యోల్బణం కూడా తగ్గింది, ప్రజలను సంతోషపెట్టింది. 2024 అక్టోబర్ నెల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తోంది.
రిటైల్ ద్రవ్యోల్బణంలో భారీ తగ్గుదల
గత నెల (2025 జనవరి)లో, దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పడిపోయింది, ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. జనవరిలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ రేట్ 4.50 శాతం ఉండవచ్చని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తే, అంతకన్నా తక్కువగా నమోదైంది. రాబోయే నెలల్లో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. జనవరి నెల ఇన్‌ఫ్లేషన్ డేటా, వడ్డీ రేట్లను తగ్గించాలన్న ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయాన్ని సమర్థిస్తుంది. అయితే, భవిష్యత్తులో రూపాయి పతనం ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) బుధవారం నాడు విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (CPI ఇన్‌ఫ్లేషన్) 2024 డిసెంబర్‌లో నమోదైన 5.22 శాతం నుంచి 2025 జనవరిలో 4.31 శాతానికి భారీగా తగ్గింది. ఏడాది క్రితం, అంటే 2024 జనవరిలో ఇది 5.1 శాతంగా ఉంది. ఆహార ధరల ద్రవ్యోల్బణం (Food Inflation) 2024 డిసెంబర్‌లో 8.39 శాతంగా ఉండగా, ఈ ఏడాది జనవరిలో 6.02 శాతానికి దిగి వచ్చింది.
ప్రాంతాల వారీగా...
గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర ద్రవ్యోల్బణం (Retail Inflation) డిసెంబర్‌లోని 5.76 శాతం నుంచి జనవరిలో 4.64 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 8.65 శాతం నుంచి 6.31 శాతానికి పడిపోయింది.
పట్టణ ప్రాంతాల్లో చిల్లర ద్రవ్యోల్బణం 4.58 శాతం నుంచి 3.87 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 7.9 శాతం నుంచి 5.53 శాతానికి దిగి వచ్చింది.
ఫిబ్రవరిలో కూడా ధరలు తక్కువగా ఉంటాయా?
దేశవ్యాప్తంగా, జనవరిలో, ఆహారం & పానీయాల ధరలు కూడా తగ్గాయి. వాటి ద్రవ్యోల్బణం రేటు గత నెలలో 5.68 శాతానికి పరిమితమైంది, డిసెంబర్‌లో ఇది 7.69 శాతంగా ఉంది. జనవరిలో కూరగాయల ధరలు అత్యధికంగా తగ్గాయి, కూరగాయల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లోని 26.56 శాతం నుంచి జనవరిలో 11.35 శాతానికి పడిపోయింది. ధరలు తగ్గే ధోరణి ఫిబ్రవరి నెలలోనూ కొనసాగవచ్చని అంచనా. ఫిబ్రవరిలో CPI ఇన్‌ఫ్లేషన్ 4 శాతంగా ఉంటుందని ICRA అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ కూడా ఫిబ్రవరి, మార్చి నెలల్లో CPI ద్రవ్యోల్బణం 3.9-4 శాతం పరిధిలో ఉంటుందని లెక్కగట్టింది.
మరో ఆసక్తికర కథనం: భూమి కొనాలా లేక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలా? - మీ పెట్టుబడిని ఏది పెంచుతుంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

