Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన
Maoists Latest News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు వచ్చిందని డీజీపీ ప్రకటించారు. కేవలం 17 మంది నేతలే మిగిలి ఉన్నారని వారు కూడా లొంగిపోతే బాగుంటుందని సూచించారు.

Maoists Latest News: తెలంగాణ రాష్ట్ర భద్రత చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిని చేరుకోవడానికి పోలీసు శాఖ సిద్ధమైంది. దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాటం, అణచివేత చర్యల తర్వాత, ఇప్పుడు మావోయిస్టులు లేని రాష్ట్రంగా మారేందుకు కొద్ది దూరంలో ఉందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 17 మంది స్థానిక మావోయిస్టు సభ్యులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారని వారు లొంగిపోతే రాష్ట్రం పూర్తిగా మావోయిస్టురహితంగా మారుతుందని స్పష్టం చేశారు.
17 మంది-2.25 కోట్లు రివార్డు
మిగిలి ఉన్న 17 మంది సభ్యులపై ప్రభుత్వం భారీగా రివార్డు ప్రకటించి ఉంది. వీరి మొత్తం రివార్డు విలువ 2.25 కోట్లుగా ఉందని డీజీపీ వెల్లడించారు. ఈ భారీ రివార్డు ప్రకటించడం వెనుక పోలీసుల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం వారి పట్టుకోవడానికే కాకుండా ఆ సభ్యులు లొంగిపోయేలా ప్రోత్సహించడానికి, ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఒక శక్తిమంతమైన సాధనంగా పని చేస్తుంది.
పార్టీ నిర్మాణంలో తెలంగాణ వారి ప్రాబల్యం
ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా ఉన్న తెలంగాణ నేతలు ఇప్పుడు సంఖ్యాపరంగా తగ్గినా కీలక బాధ్యతల్లో ఉన్నారు. డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం పార్టీ నిర్మాణంలో వీరి పాత్ర చాలా ఉంది.
కేంద్ర కమిటీ: పార్టీ జాతీయ స్థాయి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే అత్యున్నత విభాగమైన కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు.
రాష్ట్ర కమిటీ: తెలంగాణ ప్రాంతీయ కార్యకలాపాలను పర్యవేక్షించే రాష్ట్ర కమిటీలో ఐదుగురు సభ్యులు పని చేస్తున్నారు.
డివిజన్ కమిటీ: క్షేత్రస్థాయిలో ఆపరేషన్‌లను నడిపించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉన్నారు.
అండర్ గ్రౌండ్: మిగిలిన ఇద్దరిలో ఒకరు అండర్ గ్రౌండ్‌లో ఉన్నారు. మరొకరు రహస్య కార్యకలాపాల్లో కొనసాగుతున్నారు.
ఈ నెట్‌వర్క్‌ను నిశితంగా గమనిస్తున్న పోలీసులు వారి కదలికలను ట్రాక్ చేస్తూ పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆపరేషన్ కగార్‌తో గడువులోపల లక్ష్యసాధన
మావోయిస్టులు పూర్తి నిర్మూలన ధ్యేయంగా కేంద్ర చేపట్టిన ఆపరేష్ కగార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ ఆపరేషన్ గడువు ముగిసేలోపు తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా కార్యకలాపాలను అణచివేయడంతోపాటు శాంతియుత మార్గాలను కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు.
లొంగిపోవడమే శ్రేయస్కరం- డీజీపీ సూచన
17 మంది సభ్యులు హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి రావాలని డీజీపీ సూచించారు. లొంగిపోవడం ద్వారా కుటుంబాలతో కలిసి శాంతియుత జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందని, ఇది వారి కుటుంబ సభ్యులలో కూడా సానుకూల ఆశను కలిగిస్తుందని చెప్పారు.
ఉన్న కొద్ది మంది మావోయిస్టులు మాత్రం ప్రభుత్వాలతో పోరాటానికే సిద్ధపడుతున్నారు. గడువు దాటిన తర్వాత కూడా తాము ఉనికిలో ఉన్నామని చెప్పేందుకు రహస్య ప్రదేశాల్లో దాక్కొని ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కీలక నేతలు తెలంగాణ డీజీపీ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. రహస్య ప్రాంతాల్లో ఉన్న వారు మాత్రం లొంగిపోయేందుకు అంగీకరించలేదు. పోరాటానికే వారంతా మొగ్గు చూపారు. వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా ప్రకటించాలని కేంద్రం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.





















