IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
IND vs NZ T20I World Cup Final: భారత్, న్యూజిలాండ్ మధ్య T20 మ్యాచ్‌లలో నలుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో భారత్ హవా కొనసాగిస్తోంది. ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు నమోదు చేశారు.

IND vs NZ T20I Record: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ హైవోల్టేజ్ మ్యాచ్ వేదికగా మారింది. ఈ మహా సంగ్రామానికి ముందు టీ20 ఇంటర్నేషనల్‌లో 2 జట్ల మధ్య ముఖాముఖీ పోరులో నమోదైన పలు రికార్డుల్ని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో సెంచరీలు సాధించిన బ్యాటర్లు ప్రత్యేకం. ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఇద్దరు సెంచరీ వీరులు భారత జట్టులో ఉండటం ఆతిథ్య జట్టుకు కలిసొచ్చే అంశం.
ఇప్పటి వరకు 2 జట్ల మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో నలుగురు బ్యాటర్లు మాత్రమే సెంచరీలు సాధించారు. వీరిలో న్యూజిలాండ్‌కు చెందిన ఒక బ్యాటర్, ముగ్గురు భారత బ్యాటర్లు ఉన్నారు. కివీస్ బ్యాటర్ కాలిన్ మన్రో, టీమిండియాకు చెందిన సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఓ మ్యాచులో పరుగుల వరద పారించారు.
తొలి సెంచరీ సాధించిన కాలిన్ మన్రో
భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20లో తొలి సెంచరీని న్యూజిలాండ్ బ్యాటర్ కాలిన్ మన్రో నమోదు చేశాడు. 4 నవంబర్ 2017న రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో అజేయమైన 109 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మన్రో తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. మన్రో స్ట్రైక్ రేట్ దాదాపు 188.
సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా న్యూజిలాండ్‌పై టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ సాధించాడు. 20 నవంబర్ 2022న మౌంట్ మౌంగనుయ్‌లో 51 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అత్యంత అత్భుతం. 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సూర్య సెంచరీ బాదేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 217 కంటే ఎక్కువగా ఉంది. టీ20 క్రికెట్‌లోని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి.
అహ్మదాబాద్‌లో శుభ్‌మన్ గిల్ మ్యాజిక్
భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్‌పై 63 బంతుల్లో నాటౌట్‌గా 126 పరుగులు చేశాడు. 1 ఫిబ్రవరి 2023న అహ్మదాబాద్‌లో గిల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైనది. అతడు భారీ షాట్లతో పాటు అద్భుతమైన క్లాసింగ్ బ్యాటింగ్ చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 200గా నమోదైంది.
ఇషాన్ కిషన్ ఇటీవలి సెంచరీ
ఇటీవల భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ సెంచరీ వీరుల ప్రత్యేక జాబితాలో చేరాడు. 31 జనవరి 2026న తిరువనంతపురంలో జరిగిన టీ20లో న్యూజిలాండ్‌పై 43 బంతుల్లో 103 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు బాదారు. ఇషాన్ స్ట్రైక్ రేట్ దాదాపు 240. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.
ఫైనల్‌లో కొత్త రికార్డులకు ఛాన్స్
ఆదివారం రాత్రి (మార్చి 8న) టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఫ్యాన్స్ మరోసారి భారత బ్యాటర్ల నుంచి భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ స్టేడియం భారీ స్కోర్లకు నిలయంగా మారింది. నేటి ఫైనల్లోనూ పరుగుల వరద ఖాయమని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి పిచ్ ఎవరికి అనుకూలిస్తుందో మరి.
ట్రెండింగ్ వార్తలు




















