TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
TVK president Vijay : పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక హామీలను విజయ్ ప్రకటించారు. పెళ్లి చేసుకోబోయే వారికి తులం బంగారం కూడా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Vijay announces party poll promises: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్న నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్.. మహాబలిపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక హామీలను ప్రకటించారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమమే తన లక్ష్యమని చాటిచెప్పిన విజయ్, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా విప్లవాత్మక పథకాలను తెరపైకి తెచ్చారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, రాష్ట్రంలో అమల్లో ఉన్న పథకాల కంటే మెరుగైన ప్రయోజనాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు.
అన్నపూర్ణి 'సూపర్ సిక్స్'
విజయ్ ప్రకటించిన హామీల్లో అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, కుటుంబ పెద్దలైన మహిళలకు అందించే నెలవారీ గౌరవ వేతనాన్ని ఏకంగా రూ. 2,500 కు పెంచుతున్నట్లు వెల్లడించారు. 60 ఏళ్ల లోపు వయసున్న మహిళా కుటుంబ పెద్దలందరికీ ఇది వర్తిస్తుందని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ పథకం నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన వివరించారు.
సోదరుడి సారె, విద్యా హక్కు
ఆడపిల్లల వివాహాల విషయంలో తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు సోదరుడి సారె అనే వినూత్న పథకాన్ని విజయ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా పెళ్లి కుమార్తెకు ప్రభుత్వం తరపున పుట్టింటి కానుకగా ఒక తులం బంగారం, పట్టు వస్త్రాన్ని అందజేస్తారు. మరోవైపు, విద్యా రంగంలో సంస్కరణలు తెస్తూ కామరాజర్ విద్యా హక్కు పథకాన్ని ప్రకటించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బడి మానేయకుండా ఉండేందుకు, ప్రతి తల్లి లేదా సంరక్షకురాలికి ఏడాదికి రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Mahabalipuram, Tamil Nadu: Actor and TVK president Vijay announces party's poll promises
— ANI (@ANI) March 7, 2026
He says, "Every family will be provided 6 free LPG gas cylinders per year. The women’s rights allowance will be increased to Rs 2,500 per month. A separate department for women, children,… https://t.co/RWMuCIlucB pic.twitter.com/XY60IMScnn
ప్రత్యేక భద్రత , పర్యవేక్షణ
మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణను తమ పార్టీ ప్రాథమిక సూత్రంగా విజయ్ అభివర్ణించారు. వీరి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, అది నేరుగా ముఖ్యమంత్రి హోదాలో తన పర్యవేక్షణలోనే పనిచేస్తుందని విజయ్ భరోసా ఇచ్చారు. సమాజంలో బలహీన వర్గాలకు భద్రత కల్పించడంతో పాటు, అవినీతి రహిత పాలనను అందిస్తామని ఆయన ఉద్ఘాటించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















