Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Konaseema News Update: కోనసీమ భగ్గమంది. గ్యాస్ పైప్‌లో ఎగసిన మంటలు మరికొన్ని రోజులు ఆగేలా కనిపించడం లేదు. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో పాసర్లపూడి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు.

Konaseema Gas Fire News Update: ప్రకృతి ఒడిలో పచ్చదనానికి మారుపేరైన కోనసీమలో మరోసారి నిప్పు సెగలు రాజుకున్నాయి. రాజమండ్రి ఓఎన్జీసీ అసెట్ పరిధిలోకి వచ్చే మలికీపురం మండలంలోని ఇరుసుమండ వద్ద ఉన్న మోరీ-5 ఆయిల్ వెల్‌లో జరిగిన భారీ గ్యాస్ బ్లో అవుట్ స్థానిక ప్రజలను వణికించింది. మూడు దశాబ్దాల క్రితం కోనసీమను ఉలిక్కిపడేలా చేసిన పాసర్లపూడి దుర్ఘటనను తలపిస్తూ ఆకాశమంత ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేసేలా చేశాయి.
అసలేం జరిగింది? ప్రమాద తీవ్రత ఎంత?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అలిపురం మండం లక్కవరం గ్రామ పరిధిలోి ఇరుసుమండ ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బావి గతంలో ఉత్పత్తిలో ఉన్నప్పటికీ, మధ్యలో ఉత్పత్తి తగ్గడంతో దీనికి మరమ్మతులు చేసేందుకే ఓఎన్‌జీసీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. గత కొన్ని రోజులుగా సదరు ప్రైవేటు సంస్థ రిగ్ ఏర్పాటు చేసి పనులు నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అత్యధిక పీడనంతో గ్యాస్ బయటకు రావడంతో అక్కడున్న అగ్ని కీలలు వ్యాపించాయి. క్షణాల్లో మంటు సుమారు అరవై నుంచి వంద మీటర్లు ఎత్తుకు ఎగసిపడ్డాయి. ఈ భయంకరమైన శబ్దాలు, మంటల తీవ్రత చూసి అక్కడి సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
పాసర్లపూడి జ్ఞాపకాలు- మళ్లీ అదే జనవరి మాసం!
కోనసీమ ప్రజలకు 30 ఏళ్ల క్రితం నాటి పాసర్లపూడి బ్లో అవుట్ ఒక చేదు జ్ఞాపకం. అప్పట్లో జనవిర 8వ తేదీన ఆ ప్రమాదం సంభవించింది. దాదాపు 30 రోజులుకపైగా మంటలు ఆరకుండా కోనసీమను దహించేసింది. విచిత్రంగా మళ్లీ అదే జనవరి మాసంలో అంటే జనవరి ఐదున ఈ ఇరుసుమండ ఘటన జరగడం స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాసర్లపూడి సమయంలో మంటలు 200 మీటర్ల ఎత్తు వరకు ఎగబాకగా, ప్రస్తుత ఇరుసుమండ ఘటనలో మంటలు ఎత్తు కొంత తక్కువగా ఉన్నప్పటికీ దాని తీవ్ర, శబ్దాలు మాత్రం ప్రజలను బెంబేలెత్తుతున్నాయి.
రంగంలోకి జిల్లా యంత్రాంగం- గ్రామాలు ఖాళీ
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. భధ్రతా కారణాల దృష్ట్యా ఇరుసుమండతోపాటు సమీపంలోని మరో మూడు గ్రామాల ప్రజలను అధికారులు క్షణం ఖాళీ చేయించారు. ఇళ్లన్నింటికీ తాళాలు వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కలెక్టర్ ధ్రువీకరించారు.
ముందు జాగ్రత్త చర్యగా స్థానిక పాఠశాలల నుంచి విద్యార్థులను కూడా ఖాళీ చేయించారు. ప్రమాద స్థలానికి సుమారు 600 మీటర్ల వరకు నివాస ప్రాంతాలు లేకపోవడం ఒక ఊరటనిచ్చే అంశమైనా గ్యాస్ లీక్ ప్రభావం ఏ క్షణాన ఏ రూపంలో ఉంటుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు.
నియంత్రణకు ఎన్ని రోజులు పడుతుంది?
ఓఎన్‌జీసీ నిపుణుల బృందం ఇప్పటికీ రంగంలోకి దిగింది. వివిధ ప్రాంతాల నుంచి నిపుణులను రప్పించి, మంటలను ఎలా అరికట్టాలనే అంశంపై చర్చిస్తున్నారు. అయితే, ఇది తక్షణమే పరిష్కారమయ్యే సమస్య కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా మంటలను ఆర్పేందుకు కనీసం 4 నుంచి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే గ్యాస్ బయటకు రాకుండా క్యాప్ బిగించే ప్రక్రియను చేపడుతున్నారు.
ఈ ఆపరేషన్ కోసం అవసరమైన యంత్ర సామగ్రి, ప్రత్యేక మెషినరీని రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంటల తీవ్ర ఎక్కువగా ఉన్నందున, సమీపంలో నిలబడటం కూడా కష్టతరంగా మారుతోంది.
భయాందోళనలో స్థానికులు
కోనసీమ ప్రజలు ఇప్పటికే నగరం గ్యాస్ పైప్‌లైన్ పేలుడు వంటి అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. నిప్పుల కుంపటిపై ఉన్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల మ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భద్రతా ప్రమాణాల విషంలో కఠినంగా ఉండాలని వారు కోరుతున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో ఈ మధ్య కాలంలో ఇది నాల్గో ఘటన కాగా, అన్నింటికంటే అతి పెద్ద బ్లో అవుట్ అని నిపుణులు భావిస్తున్నారు.
అప్రమత్తతే ముఖ్యం
ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం పెద్ద ఊరట. అయితే గ్యాస్ ప్రెజర్ తగ్గే వరకు, మంటలు అదుపులోకి వచ్చే వరకు కోనసీమపై ఈ ముప్పు పొంచి ఉంటుంది. ఓఎన్‌జీసీ అధికారులు, జిల్లా యంత్రాంగం నిరంతరం సమన్వయం చేసుకుంటూ మంటను నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు.





















