History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
లండన్‌లోని ఒక వేలం పాట.. కోట్లకు అమ్ముడైపోతున్న భారతీయ పవిత్ర వారసత్వం! 127 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ ఆఫీసర్ పట్టుకెళ్ళిన భగవాన్ బుద్ధుని అస్థికల కథ ఇది. సోత్బీస్ వేలంలో అమ్ముడైపోవాల్సిన ఈ నిధిని భారత్ మళ్ళీ ఎలా దక్కించుకుంది? అసలేమిటీ 'పెప్పే రిలిక్స్'? తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి!"
గౌతమ బుద్ధుడు కుషీనగర్‌లో మరణించిన తర్వాత, ఆయన పవిత్ర అస్థికలను ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిని మగధ, వైశాలి, కపిలవస్తు వంటి అప్పటి ఎనిమిది రాజ్యాల వారు పంచుకుని, వాటిపై స్తూపాలను నిర్మించారు. తర్వాతి కాలంలో, సామ్రాట్ అశోకుడు ఆ స్తూపాలను తెరిపించారు. బుద్ధుని అస్థికలను వేలాది చిన్న భాగాలుగా విభజించి బుద్ధుని జీవితంతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ కు పంపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని పిప్రావా ప్రాంతం బుద్ధుని వంశమైన 'శాక్యుల' రాజధాని కపిలవస్తు కు అతి దగ్గరలో ఉంది. బుద్ధుని మరణం తర్వాత శాక్యులు తమ వాటాగా తెచ్చుకున్న అస్థికలపై అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించారు. ఆ తర్వాత అశోకుడు వాటిని పునర్నిర్మించారా లేదా అస్థికలను భద్రపరిచారా ... అప్పుడు ఏంజరిగింది అనేది ఎవరికీ తెలియదు. కానీ అశోకుడు పంపిణీ చేసిన ఆ అస్థికలు భూమిలోనే భద్రంగా ఉన్నాయి. శతాబ్దాలు గడిచేకొద్దీ, యుద్ధాలు ... ఇలా కాలక్రమేణా ఆ స్తూపాలు మట్టిలో కలిసిపోయి దిబ్బలులా మారిపోయాయి. ప్రజలు వాటిని మర్చిపోయారు.
1898లో విలియం పెప్పే అనే బ్రిటిష్ అధికారి పిప్రావాలోని మట్టి దిబ్బను తవ్వినప్పుడు, లోపల ఒక పెద్ద రాతి పెట్టె దొరికింది. ఆ పెట్టెపై ఉన్న బ్రాహ్మీ లిపి శాసనం ప్రకారం.. అవి బుద్ధుని సొంత శాక్య వంశీయులు భద్రపరిచిన పవిత్ర అస్థికలు అని నిర్ధారణ అయింది. ఆ అస్థికలలో కొన్నింటిని బ్రిటిష్ ప్రభుత్వం థాయ్‌లాండ్ రాజు Chulalongkornకి బహుమతిగా అందజేసింది. మరో భాగం ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉంది.
అయితే ఈ అస్థికలతో పాటు బ్రిటిష్ అధికారి Peppe కు అత్యంత విలువైన రత్నాలు, బంగారం, ముత్యాలు పొదిగిన అస్థికల పాత్రలు దొరికాయి. అప్పట్లో నిబంధనల ప్రకారం చాలా వరకు ప్రభుత్వానికి అప్పగించినా, కొన్ని అపురూపమైన రత్నాలు, అస్థికల ముక్కలను పెప్పే తనతోపాటే ఉంచుకుని ఇంగ్లాండ్ పట్టుకెళ్లిపోయారు. 127 ఏళ్లుగా ఆ పవిత్ర వస్తువులు ఇంగ్లాండ్‌లోని పెప్పే కుటుంబీకుల వద్ద రహస్యంగా ఉన్నాయి. ప్రపంచానికి వీటి గురించి పెద్దగా తెలియదు. పెప్పే కుటుంబం ఈ అపురూపమైన బుద్ధుని అస్థికలను మరియు రత్నాలను అంతర్జాతీయ వేలం సంస్థ అయిన 'సోత్బీస్' ద్వారా అమ్మకానికి పెట్టారు. ఇది తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఇవి భారతదేశపు జాతీయ సంపద, పవిత్ర వారసత్వం, వీటిని వేలం వేయకూడదు" అని భారత ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాల ద్వారా ఒత్తిడి తెచ్చింది. చివరికి ఆ వేలాన్ని నిలిపివేసి, 127 ఏళ్ల తర్వాత జులై 2025లో వాటిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.
సంపద అంటే కేవలం డబ్బు, బంగారం మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వం కూడా. 127 ఏళ్ల క్రితం పరాయి గడ్డకు తరలిపోయిన మన బుద్ధుని ఆత్మ మళ్ళీ తన సొంత గడ్డపైకి చేరుకుంది. ఇది కేవలం అస్థికల రాక కాదు, భారతీయ ఆత్మగౌరవ పునర్వైభవం!





















