Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
ప్రధాని మోదీపై పార్లమెంటులోనే కుట్రకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్లాన్ చేశారా.? అందుకే రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకుండానే ధన్యవాద తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పాస్ చేశారా.? అవునంటూ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ వీడియోను పరిశీలిస్తే ప్రధాని మోదీ కాసేపట్లో సభలోకి వస్తున్నారనగా...ముగ్గురు కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఓ బ్యానర్ తీసుకుని ప్రధాని మోదీ కుర్చీ వద్దకు చేరుకున్నారు. పార్లమెంటు భద్రత దృష్ట్యా ప్రధాని మోదీ కూర్చునే స్థలాన్ని హాట్ స్పాట్ గా పరిగణిస్తారు. ప్రధాని మోదీ తప్ప ఆ కుర్చీ వద్దకు రావటానికి వేరే వారికి భద్రతా కారణాలతో అనుమతి ఉండదు. అలాంటిది మహిళా ఎంపీలు ప్రధాని కుర్చీ వద్దకు దూసుకురాగానే కేంద్రమంత్రులు నిర్ఘాంత పోయారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్..ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రధాని కాసేపట్లో సభకు వస్తున్నారని హెచ్చరించారు. అయినా మహిళా ఎంపీలు వినకపోగా...మరికొంత మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీ వద్దకు చేరుకోవటంతో కేంద్రమంత్రులు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్యను ప్రధాని మోదీపై దాడిగా పరిగణించిన స్పీకర్ ఓంబిర్లా ప్రధాని మోదీని సభకు రావొద్దని సూచించి...తీర్మానాన్ని పాస్ చేసి...సభను వాయిదా వేశారు. సరిగ్గా ప్రధాని వచ్చే సమయానికి మహిళా ఎంపీలు రావటం...ప్లకార్డులు..బ్యానర్లు పార్లమెంటులోకి నిషేధం ఉన్నా వాటిని తీసుకురావటం....ఈ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విచారణ చేస్తున్నారు.























