Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Supreme Court: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్ని జల వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది.

Supreme Court: దశాబ్దాలుగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల జల జగడం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తట్టింది. పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదం సోమవారం సుప్రీంకోర్టులో విచారణ రసవత్తరంగా సాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం అనే కొత్త మార్గాన్ని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న న్యాయస్థానం, కేవలం న్యాయపరమైన పోరాటాల కంటే పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడింది.
తెలంగాణ వాదన: మా వాటాకు గండి పడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలను బలంగా వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాల వినియోగం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా గోదావరి నదిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నీటి వాటాకు ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు పొంచి ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విభజన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రంగా తెలంగాణకు తన నీటి అవసరాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా ఏపీ పట్టించుకోవడం లేదు అని సింఘ్వీ వాదించారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుపై తక్షణమే స్టే ఇవ్వాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన మధ్యంతర ఉపశమనాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కౌంటర్; మా భూభాగంలో ప్లాన్ చేసుకుంటే తప్పేంటీ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి గట్టిగా బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, కేవలం డీపీఆర్, సర్వేల కోసం మాత్రమే టెండర్లు పిలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కవారికి అభ్యంతరం ఏంటీ అనే ఆసక్తికరమైన ఉదాహరణతో రోహత్గి తన వాదన వినిపించారు. రాయలసీమ వంటి కరవు ప్రాంతాలకు నీటిని అందించడమే తమ లక్ష్యమని ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను వాడుకోవడమే తమ ఉద్దేశమని, ఇది జాతీయ ప్రాజెక్టు కాదని, కేవలం రాష్ట్ర అవసరాల కోసం చేస్తున్న ప్లానింగ్ మాత్రమేనని ఏపీ వాదించింది. తెలంగాణ కూడా గోదావరిపై వేర్వేరు ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ తరఫున మరో న్యాయవాది జగదీప్ గుప్తా కోర్టుకు వివరించారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- మూడు పరిష్కార మార్గాలు
ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యాకాంత్ కొన్ని కీలకమైన ప్రశ్నలు అడిగారు. ప్రాజెక్టు ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్నప్పుడు అభ్యంతరాలు ఎందుకు, ఒక వేళ ప్లానింగ్ డాక్యుమెంటేషన్ విఫలమైతే ఏపీ నిధులే వృథా అవుతాయి కదా, అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు నిర్మించే సమయంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం అవసరమని సీజేఐ సూచించారు.
ఈ చిక్కుముడి విప్పడానికి సుప్రీంకోర్టు మూడు ప్రధాన పరిష్కారాలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచింది.
సివిల్ సూట్ ఫైల్ : సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ద్వారా రావాలని సూచించింది.
కేంద్ర కమిటీకి అధికారాలు : ఇప్పటికే కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ అభ్యంతరాలను పరిశీలించే అధికారం ఇవ్వడం. అవసరమైతే ప్రాజెక్టును నిలిపి వేసే నిర్ణయాధికారాన్ని కూడా ఆ కమిటీకి అప్పగించడం
మధ్యవర్తిత్వం: ఇరు రాష్ట్రాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం
జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి న్యాయపరిధి ఉంటుందని గుర్తు చేస్తూ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం వెతకాలని సీజేఐ కోరారు. అయితే సుప్రీంకోర్టు సూచించిన ఈ ప్రతిపాదనలపై తమ నిర్ణయాన్ని తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.





















