Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Nizamabad Crime News:నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను చంపి గుండెపోటుతో చనిపోయినట్టు భార్య అందర్నీ నమ్మించింది. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో దొరికిపోయింది.

Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గాం(కే) గ్రామంలో గత నెలలో చోటు చేసుకున్న ఒక మరణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. తొలుత గుండెపోటుగా భావించిన ఒక సాధారణ మరణం వెనుక 13 ఏళ్ల వైవాహిక బంధాన్ని కాలరాస్తూ ఒక భార్య పన్నిన కుతంత్రం దాగి ఉందని పోలీసులు ఛేదించారు. భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ఆమె స్కెచ్ వేసింది. సుపారీ ముఠాను పురమాయించింది. ఇలా ప్రతి అంశం సినిమా కథను తలపిస్తోంది.
గుండెపోటు నాటకం- హడావుడిగా అంత్యక్రియలు
బోర్గాం గ్రామానికి చెందిన పల్లాటి రమేష్ సౌమ్య దంపతులకు 13 ఏళ్ల కిందట వివాహమైంది. గత నెల 20న రమేష్ తన ఇంట్లో హఠాత్తుగా మరణించాడని, ఆయనకు గుండెపోటు వచ్చిందని సౌమ్య బంధువులను, గ్రామస్థులను నమ్మించింది. ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఏడుపులు, పెడబొబ్బలతో నాటకమాడి, అత్యంత హడావుడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేయించింది. భర్త అకాల మరణంతో అందరూ సౌమ్యను ఓదార్చారు. ఆమె కళ్లల్లో ఉన్న క్రూరత్వాన్ని పసిగట్టలేకపోయారు.
ఫారెన్ నుంచి వచ్చిన వచ్చిన ఫోన్ కాల్‌తో తిరగబడిన కథ
రమేష్ మరణంపై తొలి అనుమానం ఇజ్రాయెల్‌లో ఉంటున్న ఆయన తమ్ముడు కేదారికి వచ్చింది. రమేష్ మృతదేహంపై, ముఖ్యంగా మెడ భాగంలో కొన్ని గాట్లు ఉన్నట్టు అక్కడి స్థానికులు కేదారికి ఫోన్ ద్వారా చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన కేదారి గత నెల 21న విదేశాల నుంచి వచ్చాడు. మాక్లూర్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. తన అన్న మరణం వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
ఫిర్యాదుపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. 2న తాహసీల్దార్ సమక్షంలో రమేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, అది సహజ మరణం కాదని, ఊపిరాడక పోవడం వల్ల జరిగిన హత్య అని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు సౌమ్యను అదుపులోకి తీసుకొని తమ స్టైల్‌లో విచారించగా అసలు విషయం చెప్పేసింది.
వివాహేతర సంబంధం- హత్యకు బీజం
నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో సౌమ్య నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న నందిపేట మండలం బాద్గుణకు చెందిన పీఈటీ నాలేశ్వర్ దిలీప్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం రమేష్‌కు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలి సౌమ్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
విఫలమైన మొదటి ప్రయత్నం
సౌమ్య, దిలీప్ కలిసి రమేష్‌ను చంపడానికి గతేడాది ఆగస్టులోనే ప్రయత్నించారు. రమేష్ తన టూ వీలర్‌పై వెళ్తుండగా దిలీప్ తన కారుతో ఢీ కొట్టాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఈ ప్రమాదంలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
బంగారు ఉంగరం తాకట్టు పెట్టి సుపారీ గ్యాంగ్‌కు పేమెంట్
మొదటి ప్రయత్నం విఫలం కావడంతో ఈసారి ప్రొఫెషనల్ కిల్లర్స్ సహాయం తీసుకోవాలని సౌమ్య భావించింది. దీని కోసం తన బంగారు ఉంగరాన్ని 35వేల రూపాయలకు తాకట్టు పెట్టింది. ఆ డబ్బును సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా ఇచ్చింది. గత నెల 19న ప్లాన్ ప్రకారం రమేష్ తాగే మంచి నీటిలో 10 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. మత్తులోకి జారుకున్న రమేష్‌ను చంపడానికి సుపారీ గ్యాంగ్‌ను రమ్మని ఫోన్ చేసింది. కానీ ఆ సమయంలో గ్యాంగ్ సభ్యులు ఫోన్ ఎత్తలేదు.
స్వయంగా తనే గొంతు నులిమి...
సుపారీ గ్యాంగ్ రాకపోవడంతో సౌమ్య ఆందోళనకు గురై ప్రియుడి దిలీప్‌కు సమాచారం ఇచ్చింది. దిలీప్ తన తమ్ముడు అభిషేక్‌త కలిసి రాత్రి సమయంలో సౌమ్య ఇంటికి వచ్చాడు. ముగ్గురూ కలిసి నిద్రలో ఉన్న రమేష్‌ను అతి దారుణంగా హత్య చేశారు. రమేష్ మెడకు టవల్ బిగించి దిండుతో ముక్కు, నోరు మూసి వేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్త ప్రాణాలు పోతున్నా ఆ ఇల్లాలు కనికరం చూపలేదు.
పోలీసుల అదుపులో నిందితులు
నిజామాబాద్ ఏసీపీ రాజవెంకట్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితులుగా సౌమ్య, దిలీప్, అభిషేక్‌తోపాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన జితేందర్, శ్రీరామ్, రమావత్ రాకేష్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నాడు. నిందితులందరిపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.





















