Urvashi Rautela: 'చిరంజీవి మాకు దేవుడి లాంటి వారు' - మెగాస్టార్‌పై ఊర్వశీ రౌతేలా ప్రశంసల జల్లు, అసలేం జరిగిందంటే?
Megastar Chiranjeevi: నటి ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన తనకు, తన కుటుంబానికి దేవుడి లాంటి వారని కష్ట కాలంలో తనకు అండగా నిలిచారని చెప్పారు.

Actress Urvashi Rautela Said Megastar Chiranjeevi Is God To Her: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనకు, తన కుటుంబానికి దేవుడిలాంటివారని బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) అన్నారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఆయనతో కలిసి నటించానని.. తనది చాలా చిన్న పరిచయ పాత్రేనని.. అయితే కష్ట సమయాల్లో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. కాగా, ఇటీవల ఊర్వశి తల్లి మీను రౌతేలా ఎడమ కాలిలో ఇంట్రా - ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఇదెంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి.. చిరంజీవిని సంప్రదించి సహాయం కోరారు. వెంటనే స్పందించిన మెగాస్టార్.. కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల బృందంతో మెరుగైన వైద్యం అందేలా చేశారు. సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారు.
దీనిపై స్పందించిన నటి ఊర్వశి.. తమ కుటుంబం మెగాస్టార్ చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. 'చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నాను. వాల్తేరు వీరయ్య షూటింగ్‌లో ఆపదలో ఉన్న వారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారు. ఆ సాయం నా వరకూ వచ్చింది. అమ్మ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చింది. మొహమాటంగా చిరంజీవి గారి సాయం కోరాను. వెంటనే స్పందించిన ఆయన కోల్‌కతాలోని డాక్టర్లతో మాట్లాడి అమ్మకు సర్జరీ చేయించారు. అనంతరం మీ అమ్మ బాగానే ఉన్నారు, ఆమె ఆరోగ్యంగా ఉంటారు. అని ఆయన చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అండగా నిలిచారు. ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాటపడొద్దన్నారు. భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం బతికే ఉందని నిరూపించారు. అందుకే ఆయన్ను దేవుడిగా, మా శక్తికి లైట్‌హౌస్‌గా భావిస్తాను.' అని ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: 'ప్లీజ్.. పైరసీని ప్రోత్సహించొద్దు' - కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ప్రేక్షకులకు లైలా టీం రిక్వెస్ట్
'దబిడి దిబిడి' కాంట్రవర్శిపై ఏమన్నారంటే.?
కాగా, నటి ఊర్వశి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో 'బాసూ వేర్ ఈజ్ ద పార్టీ' సాంగ్‌లో స్టెప్పులతో సందడి చేశారు. అలాగే, ఇటీవలే బాబీ దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజైన 'డాకు మహరాజ్' (Daaku Maharaj) సినిమాలో బాలయ్యతో కలిసి నటించారు. ఆ సినిమాలో 'దబిడి దిబిడి' పాటకు బాలకృష్ణతో వేసిన స్టెప్పులు కాంట్రవర్శీగా మారడంపై ఆమె తాజాగా స్పందించారు. ప్రేక్షకుల నుంచి ఈ విధమైన స్పందన తాను అస్సలు ఊహించలేదని.. ఆ పాట, అందులోని స్టెప్పులు ఆడియన్స్ ఆదరిస్తారని అనుకున్నట్లు చెప్పారు. 'సినిమాలోని అన్ని పాటలకూ కొరియోగ్రఫీ ఏ విధంగా ఉంటుందో ఈ పాటకూ అలాగే చేశాం. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం అభ్యంతరకరం అనిపించలేదు. వీటిని తప్పుపట్టడానికి కారణం ఏంటో కూడా అంచనా వేయడానికి సమయం లేకపోయింది. అంతా సడెన్‌గా జరిగిపోయింది. ఇలాంటి రెస్పాన్స్ నేను ఊహించలేదు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసిన కామెంట్స్ నేను పట్టించుకోను.' అని ఊర్వశి తెలిపారు.






















