Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
తాను కోరడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నిలిపివేశారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదని ఏపీ ప్రభుత్వం కొట్టిపారేసింది.

Telangana CM Revanth Reddy | అమరావతి: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యా్ఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ ఇస్తూ వివరణ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావడం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (RLIS) ప్రాజెక్టును నిలిపివేశారన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వం కొట్టిపారేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం వివరణ
తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ఒత్తిడి తేవడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేశారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రేవంత్ రెడ్డి మాటలు అసంబద్ధమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఏపీ నీటి హక్కుల విషయంలో, ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సరైన అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టారని ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలిస్తామంటూ జగన్ హయాంలో చేసిన ప్రకటనల వల్లే తెలంగాణ ప్రభుత్వం కోర్టులకు వెళ్లిందని, ఫలితంగా 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని ఆదేశించాయని స్పష్టం చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ఈ పనులను అడ్డుకుందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఆయన ఒత్తిడి వల్ల పనులు ఆగలేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివే
తెలంగాణ అసెంబ్లీలో శనివారం నాడు కృష్ణా జలాలపై నీళ్లు - నిజాలపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న వారికి ఓ విషయం తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు చేపడితే, తాను ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆ పనులను ఆపించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారని, దీనిపై ఏమైనా అనుమానం ఉంటే నిజనిర్ధారణ కమిటీని పంపాలని సైతం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
తాను తెలంగాణ కోసం సొంత పార్టీని (TDP) కూడా వదిలిపెట్టానని, సీఎంగా తనకు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రతిపక్షనేత కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తారని ఆశించామని, కానీ ఆయన గైర్హాజరు కావడం విచారకరమని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాపై, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కానీ, సభలో చర్చకు రావాలంటే కేసీఆర్ రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాలుగు కోట్ల మంది ప్రజలకు అసెంబ్లీ వేదిక లాంటిదని, ఇక్కడ చర్చిస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయని, కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ సభకు రాకుండా మీడియాతో మాట్లాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.






















