Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
సిడ్నీ కాల్పుల ఘటనలో ఉగ్రవాదులను అడ్డుకుని గాయాలపాలైన అహ్మద్‌తో పాటు సహాయక చర్యల్లో పొల్గొన్న పోలీసులు, సిబ్బందిని గౌరవించారు. సిడ్ని టెస్ట్ కు ఆహ్వానించి క్రికెట్ ఆస్ట్రేలియా వారిని గౌరవించింది.

సిడ్నీ: సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమైన యాషెస్ సిరీస్ 5వ టెస్టు ఒక ప్రత్యేక సందర్భానికి వేదికైంది. ఇటీవల సిడ్నీలోని బాండీ బీచ్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో తన ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులను అడ్డుకున్న హరో అహ్మద్ అల్ అహ్మద్ ను, అత్యవసర సేవల సిబ్బందిని ఇరు జట్ల ఆటగాళ్లు ఘనంగా సన్మానించారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు గార్డ్ ఆఫ్ హానర్
మైదానంలో ఆటగాళ్లు ఒక వరుసలో నిలబడి (గార్డ్ ఆఫ్ హానర్) బాండీ బీచ్ బాధితులకు సహాయం చేసిన వీరులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సమయంలో స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆ వీరులను అభినందించారు. ముఖ్యంగా, దుండగుడి నుండి గన్‌ను లాక్కుని ప్రాణాలకు తెగించి పోరాడిన అహ్మద్ అల్ అహ్మద్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం చప్పట్లతో మార్మోగింది. మంచి చేసేందుకు ప్రయత్నిస్తే దాని రిజల్ట్ ఇంత గొప్పగా ఉంటుందని సిడ్నీ బీచ్ కాల్పుల ఘటనలో దుండగులను అడ్డుకున్న ఘటన నిరూపించింది.
బాండీ బీచ్‌లో దురదృష్టకర ఘటన
డిసెంబర్ 14న బాండీ బీచ్ వద్ద జరిగిన హనుక్కా వేడుకను లక్ష్యంగా చేసుకుని సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రీకొడుకులు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిని అధికారులు ఒక విద్వేషపూరిత ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ స్పందిస్తూ, ఇది ఒక హృదయవిదారక విషాదంగా పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి ఇతరులను రక్షించిన అహ్మద్‌ను, పోలీసు అధికారులకు, అంబులెన్స్ సిబ్బందికి, పౌరులకు ధన్యవాదాలు తెలిపారు.
బాండీ బీచ్ షూటింగ్ నిందితుడు హైదరాబాద్ వాసి..
సిడ్నీ/హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో డిసెంబర్ 14న జరిగిన భీభత్సానికి సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దాడికి పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అని దర్యాప్తులో తేలింది. తొలుత వీరిని పాకిస్థానీయులుగా భావించినప్పటికీ, విచారణలో వీరు హైదరాబాద్ నుంచి వలస వెళ్లినట్లు నిర్ధారణ అయింది.
సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ ఒక క్రిస్టియన్ మహిళను వివాహం చేసుకున్న తర్వాత హైదరాబాద్‌లోని తన కుటుంబంతో సంబంధాలను తెంచుకున్నాడు. సాజిద్ తల్లి ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నప్పటికీ, ఆమె అనారోగ్యంతో ఉన్నా కనీసం పలకరించలేదని అతని సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేవలం ఆస్తి పంపకాల కోసం వచ్చి గొడవ పడటం తప్ప, కుటుంబంతో అతనికి ఎలాంటి అనుబంధం లేదని వారు మీడియాకు తెలిపారు.
మృతదేహాన్ని నిరాకరించిన భార్య
ఘటనా స్థలంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన సాజిద్ అక్రమ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని భార్య నిరాకరించింది. అతను చేసిన అమానవీయ చర్యల పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాజిద్ ప్రవర్తన నచ్చక ఆమె కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తన భర్త చేసిన దారుణమైన నేరం వల్ల తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం అతని మృతదేహాన్ని తాకబోనని ఆమె తెగేసి చెప్పింది.






















