US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
US Taxes: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ప్రతిపాదించిన 500 శాతం సుంకాల బిల్లుపై భారత్ స్పందించింది. పట్టించుకునేది లేదని స్పష్టం చేసింది.

Russian oil: రష్యా నుంచి చౌకగా ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా సెనేట్ ప్రతిపాదించిన 500 శాతం సుంకాల బిల్లుపై భారత్ గట్టిగా స్పందించింది. 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాలే తమకు పరమావధి అని, ఇంధన కొనుగోలు విషయంలో భారత్ ఎప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ శాఖ (MEA) స్పష్టం చేసింది.
అమెరికా 500% టారిఫ్ బెదిరింపు - భారత్ ధీటైన సమాధానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపిన శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లుపై భారత్ అప్రమత్తమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, తాము ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. మా 140 కోట్ల ప్రజలకు తక్కువ ధరకే ఇంధనాన్ని అందించడం మా బాధ్యత. ప్రపంచ మార్కెట్ గతిశీలతను బట్టి మా నిర్ణయాలు ఉంటాయి అని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఇంధన భద్రతే భారత్ ప్రాధాన్యత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన సమయంలో భారత్ రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ముడిచమురును కొనుగోలు చేస్తోంది. ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి , సామాన్యులపై భారం పడకుండా ఉండటానికి దోహదపడింది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం వంటి వారు భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లును ఒక అస్త్రంగా వాడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ ని కాపాడుకుంటామని, ఇంధన భద్రత విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గబోమని స్పష్టం చేసింది.
ట్రేడ్ వార్ ముప్పు - భారత ఎగుమతులపై ప్రభావం?
ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారి, అమెరికా 500 శాతం సుంకాలను విధిస్తే, అది భారత్-అమెరికా మధ్య ఉన్న సుమారు 120 బిలియన్ డాలర్ల వ్యాపార సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారత వస్తువులపై అమెరికా 25 నుండి 50 శాతం వరకు పెనాల్టీ టారిఫ్‌లను విధిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే అమెరికా సెనేటర్లతో చర్చలు జరుపుతూ భారత్ ఆందోళనలను వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు దీనిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నం
అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ భారత్‌కు రానున్న తరుణంలో ఈ బిల్లు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ ఇప్పటికే రష్యా నుండి దిగుమతులను కొంత మేర తగ్గించి, అమెరికా , మధ్యప్రాచ్య దేశాల నుండి దిగుమతులను పెంచడం ద్వారా సమతుల్యతను పాటిస్తోంది. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా రష్యా చమురు ఆర్డర్లను నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. వివాదాల కంటే దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోంది.





















