Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Telangana DGP: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను వచ్చే నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూపీఎస్‌సీ ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం శాశ్వత డీజీపీ ఎంపికను ముగించాలని స్పష్టం చేసింది.

Telangana High Court ordered UPSC Chairman: తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను వచ్చే నాలుగు వారాల్లోకా పూర్తి చేయాలని యూపీఎస్‌సీ ఛైర్మన్‌ను కోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ లిస్టును పరిశీలించి, నిబంధనల ప్రకారం శాశ్వత డీజీపీ ఎంపికను ముగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తీసుకున్న చర్యలపై ఫిబ్రవరి 5, 2026 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
తెలంగాణ డీజీపీగా బి. శివధర్ రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి. ధన్‌గోపాల్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018లో సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను ఈ నియామకం ఉల్లంఘించిందని పిటిషనర్ వాదించారు. ముఖ్యంగా, శాశ్వత డీజీపీని నియమించే ముందు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్‌సీ (UPSC) కి పంపి, వారి ఆమోదం పొందాలనే నిబంధనను ప్రభుత్వం పాటించలేదని, కేవలం తాత్కాలిక లేదా అదనపు బాధ్యతల (FAC) ప్రాతిపదికన ఈ నియామకం జరిగిందని ఆరోపించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తాము ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్‌సీకి పంపించామని తెలిపారు. అయితే, యూపీఎస్‌సీ ఈ జాబితాను తిప్పి పంపుతూ ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడంలో ఏడేళ్ల సుదీర్ఘ జాప్యం చేసిందని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత పంపిన జాబితాను యూపీఎస్‌సీ ఆమోదించిందని, తెలంగాణ విషయంలో ఇలాంటి అభ్యంతరాలు చెప్పడం సరికాదని వాదించింది.
డీజీపీగా శివధర్ రెడ్డి గారి నియామక ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి) హైకోర్టు నిరాకరించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్ మధ్యంతర విన్నపాన్ని కోర్టు కొట్టివేసింది. యూపీఎస్‌సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన తన బాధ్యతల్లో కొనసాగవచ్చని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతం యూపీఎస్‌సీ వద్దకు చేరింది, అక్కడ నాలుగు వారాల్లోపు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పదవి ఖాళీ అవ్వడానికి మూడు నెలల ముందే అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్‌సీ కి పంపాలి. యూపీఎస్‌సీ ఆ జాబితాలో నుంచి మెరిట్, సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. నియామకమైన అధికారికి కనీసం రెండేళ్ల పదవీ కాలం ఉండాలి. ఒకవేళ ఆ లోపు ఆయన రిటైర్ కావాల్సి ఉన్నా, రెండేళ్లు పూర్తయ్యే వరకు కొనసాగించేలా ఫిక్స్‌డ్ టెన్యూర్ ఇవ్వాలనేది ప్రధాన నిబంధన.
ప్రభుత్వాలు తరచుగా తమకు అనుకూలంగా ఉండే అధికారులను డీజీపీ సీటులో కూర్చోబెట్టాలని చూస్తాయి. యూపీఎస్‌సీ ద్వారా ఎంపిక జరిగితే, కేవలం సీనియారిటీ, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది తప్ప, రాజకీయ విధేయతకు తావుండదు. అందుకే ప్రభుత్వాలు పూర్తిస్థాయి నియామకం చేపట్టకుండా, తమకు నచ్చిన అధికారికి పూర్తి అదనపు బాధ్యతలు (Full Additional Charge - FAC) అప్పగించి నెలల తరబడి కొనసాగిస్తాయి. ఇలా చేయడం వల్ల సదరు అధికారి ప్రభుత్వంపై ఆధారపడి ఉంటారని, తద్వారా పోలీసు వ్యవస్థపై రాజకీయ పట్టు సాధించవచ్చనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారిని నియమించి, తర్వాతి కాలంలో వారికి రెండేళ్ల గడువు పెంచడం ద్వారా తమ పనులను చక్కబెట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే శాశ్వత నియామకాలను వాయిదా వేస్తుంటాయి.





















