Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చే దిశగా కాకినాడలో భారీ అడుగు పడింది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా కాంప్లెక్స్‌లో యంత్రపరికరాల బిగింపు ప్రారంభమయింది.

Andhra Pradesh is Saudi Arabia of green energy : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్రకు వేదికగా నిలిచిన కాకినాడ ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. యంత్రాల బిగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గతంలో మూతపడిన నాగార్జున ఫెర్టిలైజర్స్ స్థానంలో, అత్యాధునిక సాంకేతికతతో ఈ సరికొత్త పర్యావరణ హిత పరిశ్రమ రూపుదిద్దుకుంటోంది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల కాకినాడ పోర్టు భవిష్యత్తులో గ్లోబల్ గ్రీన్ గేట్‌వేగా మారబోతోంది.
గ్రీన్ ఎనర్జీలో సౌదీ అరేబియా .. ఏపీ !
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీలో సౌదీ అరేబియా గా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించారు. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు, కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఇది క్లైమేట్ చేంజ్ పోరాటంలో ఏపీ వేసిన చారిత్రాత్మక అడుగు అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కాకినాడలో రావడం మనందరికీ గర్వకారణమని, ఇక్కడి నుంచి జర్మనీ, జపాన్ వంటి అగ్రదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేస్తామని వెల్లడించారు.
కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఏఎం గ్రీన్ సంస్థ యంత్రపరికరాల బిగింపు పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు.#13kCrInvestmentInKakinada#AMGreenChoosesAP #KakinadaGoesGreen #IndiaExportsEnergy… pic.twitter.com/Zw7ePs46Xd
— Telugu Desam Party (@JaiTDP) January 17, 2026
పెట్టుబడిదారులకు పవన్ భరోసా
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధిని సమర్థించారు. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు కాదని, ప్రకృతిని కాపాడుకుంటూ మానవ జీవితాలను మెరుగుపరచడమే అని ఆయన పేర్కొన్నారు. ఏఎం గ్రీన్ సంస్థ క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా భూతాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. కాకినాడ పోర్టు సమీపంలో ఈ ప్లాంట్ ఉండటం వల్ల లాజిస్టిక్స్ పరంగా ఎంతో లాభమని, ఇది స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొండంత అండగా ఉంటుందని, రాయితీలు మాత్రమే కాకుండా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు ఆయన భరోసా ఇచ్చారు.
వేల ఉద్యోగాలు - లక్షల కోట్ల సంపద
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు , పరోక్షంగా సుమారు 8,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 2030 నాటికి ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనికి అవసరమైన విద్యుత్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా 7.5 గిగావాట్ల సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ పారిశ్రామిక విప్లవం ద్వారా కేవలం కాకినాడకే కాకుండా, అనుబంధ రంగాలైన రవాణా, గోడౌన్లు , నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతకు మేలు జరుగుతుందని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
సభకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఏఎం గ్రీన్ సంస్థకు చెందిన అత్యాధునిక యంత్రపరికరాల బిగింపు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నమూనాను, టెక్నాలజీని ఇంజనీర్లు వారికి వివరించారు. సింగపూర్, మలేషియా , యూఏఈకి చెందిన దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ స్టేట్ అని చెప్పడానికి ఈ వేగవంతమైన పురోగతే నిదర్శనమని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.






















