Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌లో నిర్వహించిన టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మీ మార్కుల కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకుందామో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TE)అక్టోబర్ 2025 సెషన్ ఫలితాలను ప్రభుత్వ అధికారికంగా విడుదల చేసింది. జనవరి 9, 2026న అప్‌డేట్ చేసిన సమాచారం ప్రకారం, అభ్యర్థులు తమ మార్కుల మెమోలను, తుది కీ వివరాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
విజయవంతంగా ముగిసిన సుదీర్ఘ ప్రక్రియ
గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ టెట్ ప్రక్రియ అనేక ఘట్టాలను దాటుకుంటూ నేడు ఫలితాల దశకు చేరుకుంది. అక్టోబర్ 23, 2025 ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, అదే రోజు నుంచి నవంబర్ 23 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ కన్వీనర్ ఎం.వీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి పరీక్షలను పూర్తి పారదర్శకతతో కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. డిసెంబర్ 10, 2025 నుంచి డిసెంబర్ 21, 2026 వరకు వివిధ విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు సౌకర్యార్థం పరీక్షకు ముందే అంటే నవంబర్ 25 నుంచి మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచారు.
కీలక తేదీలు, ఫలితాల విశ్లేషణ
పరీక్షలు ముగిసిన వెంటనే, జనవరి 2, 2026న ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జనవరి 6న తుది కీ ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 9న తుది ఫలితాలు ప్రకటించారు. తాజా అప్‌డేట్ ప్రకారం అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను వెబ్‌సైట్ నుంచి ప్రింట్ తీసుకునే వెసులుబాటు కల్పించారు.
సందేహాలు నివృత్తికి హెల్ప్‌లైన్ నెంబర్లు
ఫలితాల వెల్లడి తర్వాత లేదా మార్కుల మెమో డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లు అందుబాటులో ఉంటారు.
- 8121947387, 8125046997
- 7995649286, 7995789286
- 9963069286, 6281704160
ఏపీ టెట్ ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థుల్లో ఉన్న ఒక ఉత్కంఠకు తెరపడింది. ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది.





















