Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Duvvada Railway Station | రైలు కింద పడి జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది.

Visakhapatnam Crime News | విశాఖపట్నం: దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఒక సైనికుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో కలకలం రేపింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో పట్టపగలే ఓ జవాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖలోని పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి ఆర్మీ జవానుగా సేవలు అందిస్తున్నాడు. శనివారం దువ్వాడ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్-1 వద్దకు చేరుకున్న ఆయన అప్పటివరకూ చాలా ప్రశాంతంగా కూర్చొన్నారు. రైలు రావడాన్ని గమనించిన వెంకటరెడ్డి ఒక్కసారిగా పట్టాలపైకి దూకాడు. రైలు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న సమయంలో రైలు పట్టాలపై తలపెట్టారు. లోకో పైలట్ రైలు వేగాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అప్పటికే రైలు మీద నుంచి వెళ్లడంతో వెంకటరెడ్డి తల తెగిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రైల్వే స్టేషన్‌లో, అది కూడా పట్టపగలు చాలా మంది ప్రయాణికులు చూస్తుండగానే క్షణాల్లో జరిగిన ఈ ఘోరం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జవాను వెంకటరెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయన ఎందుకు ఈ పనిచేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా దేశానికి రక్షణ కల్పించే జవాను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.






















