Ayyappa Mandala Deeksha: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!
Ayyappa Deeksha 41 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష చేపడతారు. మరో ఆలోచన లేకుండా అనుక్షణం భగవంతుడి నామస్మరణలో గడుపుతారు. మరి మాల కారణంగా మీలో రావాల్సిన మార్పులేంటో తెలుసా..
![Ayyappa Mandala Deeksha: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా! sabarimala ayyappa deeksha what is the secret of health behind ayyappa mala why should called swami know in telugu Ayyappa Mandala Deeksha: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/19/29930d4635629dea3f41380095ab8e511732033406402217_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saranam Ayyappa: కార్తీకమాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా అయ్యప్ప మాలధారులు కనిపిస్తుంటారు. 41 రోజుల అంత్యంత నియమ నిష్టలు పాటిస్తారు. అయితే 41 రోజుల పాటు దీక్ష అంటే ఆ 41 రోజులు మాత్రమే కాదు.. మండల దీక్ష గడిచిన తర్వాత కూడా నూటికి నూరుశాతం కాకపోయినా కొన్ని నియమాలు కొనసాగించాలి..ముఖ్యంగా ప్రవర్తన విషయంలో. అయ్యప్ప మాలధారులు మండల దీక్షలో భాగంగా అనుసరించే నియమాలు - వాటి ఆరోగ్య రహస్యాలు
వెన్ను నొప్పి తగ్గించే నేలపై నిద్ర
అయ్యప్ప మాల వేసుకున్నవారు మండల దీక్షా సమయంలో నేలపై నిద్రిస్తారు. 41 రోజుల పాటూ తలకింద దిండు కూడా వినియోగించకుండా నేలపై నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు బలంగా మారుతాయి..రక్త ప్రసరణ బావుంటుంది
నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే చన్నీటి స్నానం
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. తద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.. ముఖంలో ప్రశాంతత ఉంటుంది
క్రమశిక్షణ, పరిశుభ్రత
నిత్యం వేకువజామునే నిద్రలేవడం, పూజ చేయడం, దీపాలు వెలిగించడం, శరణు ఘోష..ఇదంతా ఓ రకమైన యోగా అనే చెప్పాలి. తోటివారికి ఇచ్చి పుచ్చుకోవడం, నిత్యం రెండుపూటలా దుస్తులు మార్చడం వల్ల పరిశుభ్రత అలవాటవుతుంది
ప్రతికూల ఆలోచనలు రావు
అయ్యప్ప మాలలో ఉన్నన్ని రోజులు..అనవసర చర్చలు, వివాదాలకు దూరంగా ఉంటారు. స్వామి ఆరాధన మినహా మరో ఆలోచన చేయరు. ఫలితంగా ప్రతికూల ఆలోచనలు రావు. తద్వారా ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది.
Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!
దురలవాట్లకు దూరంగా
నిత్యం ఓ పూట భోజనం అలవాటు చేసుకోవడం వల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది. పైగా శాఖాహారం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దురలవాట్లకు దూరంగా ఉంటారు. అందుకే ఆరోగ్యం, మనసు, ఆలోచనలో మెరుగుదల కనిపిస్తుంది.
శరీరానికి వేడినిచ్చే నల్ల దుస్తులు
అయ్యప్ప దీక్ష చేపట్టిన వారు నల్ల దుస్తులు ధరిస్తారు. శనికి నల్ల రంగు అంటే ప్రీతి..అందుకే నల్లని దుస్తులు నిత్యం ధరించి అయ్యప్ప పూజ చేసేవారిపై శని ప్రభావం ఉండదంటారు. పైగా శీతాకాలంలో శరీరానికి నల్ల దుస్తులు వెచ్చదనాన్ని ఇస్తాయి..
మానసిక ఆరోగ్యం
అయ్యప్ప మాలలో భాగంగా రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసలు ఇలా వివిధ రకాల మాలలు ధరిస్తారు. ఈ మాలలు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి.
నాడి జ్ఞానాన్ని ఉత్తేజితం చేసే గంధం
నుదుటి మధ్య భాగంలో “సుషుమ్న” నాడి ఉంటుంది..జ్ఞానాన్నిత్తే ఈ నాడిని గంధం ఉత్తేజితం చేస్తుంది.
నేను అనే భావన ఉండదు
మాలధారుల్లో నేను-నాది అనే భావన నశించిపోతుంది. పేరు పెట్టి కూడా పిలుచుకోరు, వేసుకునే దుస్తులు మారిపోతాయి, శారీరక సుఖాలు విడిచిపెట్టేస్తారు, ఆహారం-ఆచార వ్యవహరాల విషయంలో అన్ని నియమాలు పాటిస్తారు. అందుకే దీక్ష చేపట్టిన వ్యక్తులందర్నీ స్వామి అని పిలుస్తారు.
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
41 రోజుల మండల దీక్షలో పాటించే ఈ నియమాలన్నీ ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయాలి. అన్నీ అనుసరించడం కుదరకపోయినా.. బ్రహ్మ ముహూర్తంలో స్నానం, భగవంతుడి ఆరాధన, జీవులన్నింటిలో భగవంతుడిని చూడడం, ప్రతికూల ఆలోచనలు విడిచిపెట్టడం, మాటతీరు - ప్రవర్తనలో మార్పు, వ్యసనాలు పూర్తిగా విడిచిపెట్టడం..ఇవన్నీ కొనసాగించాలని అర్థం.
మాల ధరించే ముందు రోజు వరకూ మద్యం, మాంసం తీసుకుని ఆ మర్నాడు మాల ధరించి.. మండల దీక్ష పూర్తైన మర్నాడే మళ్లీ యధావిధిగా మారిపోతున్నారు.. ఇలాంటప్పుడు 41 రోజుల దీక్షకు అర్థం లేదని గ్రహించాలని సూచిస్తున్నారు పండితులు.
ఎందుకంటే అయ్యప్ప మాల అనేది ఓ ప్రతిజ్ఞ లాంటింది..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందే క్రమమే అయ్యప్ప మండల దీక్ష
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)