Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
NIA arrests Gade Innaiah | సామాజిక ఉద్యమకారులు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)ని ఎన్ఐఏ అధికారులు జనగామ జిల్లాలో అరెస్ట్ చేశారు.

Gade Innaiah Arrest | హైదరాబాద్: మాజీ మావోయిస్టు, బిఆర్ఎస్ మాజీ నేత గాదే ఇన్నయ్య అరెస్టు కలకలం రేపుతోంది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి పలు వాహనాల్లో వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఇదివరకే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో గాదే ఇన్నయ్య (గాదే ఇన్నారెడ్డి)ని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ ఆయనపై తీవ్రమైన అభియోగాలు నమోదు చేస్తూ చర్యలు చేపట్టింది.
నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు
మాజీ మావోయిస్టు నేత గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం కోసం పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. నిషేధిత సంస్థల భావజాలాన్ని ప్రచారం చేయడం, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం ద్వారా దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ ఆయనతో పాటు ఇతరులపై ఉపా (UAPA) చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో జనగామ జిల్లాలో ఎన్ఐఏ గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసుకుంది.
అంత్యక్రియల సభలో ప్రసంగం
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సభ గాదె ఇన్నయ్య అరెస్టుకు ప్రధాన కారణమైంది. సీపీఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన 'అమరుల బంధు మిత్రుల సంఘం' (ABMS) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 'భారత్ బచావో' వ్యవస్థాపకుడిగా గాదె ఇన్నయ్య ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా భారత ప్రభుత్వ భద్రతా బలగాలు రామచంద్రారెడ్డిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేశాయని ఇన్నయ్య ఆరోపించారు.
సాక్ష్యాధారాలు.. ఎన్ఐఏ క్లారిటీ
సుమారు 150 నుండి 200 మంది ప్రజలు పాల్గొన్న ఆ అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య చేసిన ప్రసంగానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో సాక్ష్యాలను ఎన్ఐఏ సేకరించినట్లు సమాచారం. ఈ ప్రసంగం ద్వారా గాదె ఇన్నయ్య ప్రజలను రెచ్చగొట్టి, దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలకు పురికొల్పే ప్రయత్నం చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
గాదే ఇన్నయ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..
గాదే ఇన్నయ్య గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
భారత్ బచావో: ప్రస్తుతానికి ఆయన 'భారత్ బచావో' అనే సంస్థ ద్వారా సామాజిక మరియు రాజకీయ అంశాలపై గళం వినిపిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఎన్ఐఏ రంగంలోకి దిగి అరెస్ట్ చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.






















