KCR Politics: మరో ఉద్యమ బాటలో కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కీలక భేటీ
KCR Gears Up for Another Movement in Telangana | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ నేతలతో కీలక సమావేశం కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా నదీ జలాల వాటా కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం (డిసెంబర్ 21న) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని భావిస్తున్న కేసీఆర్, ఈ సమావేశంలో నూతన జలసాధన ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని గాలికొదిలేసిందని, ఏపీకి నీళ్లు అప్పగించేసి, రాష్ట్ర ప్రజలు, రైతులను ఇబ్బంది పెడుతుంది అనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. దానిపైనే పోరాటానికి గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
గత జలసాధన స్ఫూర్తితో..
జోగుళాంబ పాదయాత్ర నుండి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో 2002-2003 కాలంలో కేసీఆర్ చేపట్టిన జల జాతర కీలకంగా మారింది. ముఖ్యంగా జోగుళాంబ ఆలయం నుండి గద్వాల వరకు ఆయన చేసిన పాదయాత్ర ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపింది. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) విషయంలో ఇతర ప్రాంత నేతల హెచ్చరికలను లెక్కచేయకుండా, తెలంగాణ నీటి వాటా కోసం ఆయన ధీటుగా బదులిచ్చారు. అంతేకాకుండా, ఆర్డీఎస్ తూముల విషయంలో అప్పటి ప్రధాని, రాష్ట్రపతికి వినతి పత్రాలు అందజేసి జాతీయ స్థాయిలో సమస్యను ఎండగట్టారు.
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు
మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. 'మిషన్ కాకతీయ' ద్వారా వేల సంఖ్యలో చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలమట్టాన్ని పెంచారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే కాకుండా, రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణను సుభిక్షం చేశారు. గోదావరి జలాలను ఒడిసి పట్టి శ్రీరాంసాగర్ పునరుజ్జీవానికి బాటలు వేశారు.
మరో పోరాటం అనివార్యం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను కేఆర్‌ఎంబీ (KRMB) కి అప్పగించడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేమని, అవసరమైతే తానే నేరుగా రంగంలోకి దిగి ఉద్యమాన్ని నడిపిస్తానని ఆయన సంకేతాలిస్తున్నారు. రాష్ట్ర సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, పార్టీ శ్రేణులను పోరాటానికి సిద్ధం చేస్తున్నారు.






















