KTR Chit Chat: బీజేపీతో రేవంత్ చీకటి స్నేహం - ఇక ప్రజల్లోకి కేసీఆర్ - చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR: మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి స్నేహం చేస్తున్నారన్నారు.

KTR made key comments in a chit chat: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ కిట్టీ పార్టీ ఆంటీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కరేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు కానీ, నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను అంటూ సవాల్ విసిరారు.
రాజకీయాల్లో సంస్కారం ఉండాలని, రేవంత్ రెడ్డి మాదిరిగా తాను ఎదుటివారి కుటుంబ సభ్యులు, మహిళలు లేదా చిన్నపిల్లల గురించి చిల్లర రాజకీయాలు చేయనని కేటీఆర్ పేర్కొన్నారు. తానెప్పుడూ హుందాగా రాజకీయం చేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ కేసుల్లో ఏమీ లేదని ఇప్పటికే రేవంత్‌కు అర్థమైందని, అందుకే ఈ కేసులను అంతులేని కథలా సాగదీస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక కాలు కాంగ్రెస్‌లో, మరొక కాలు బీజేపీలో ఉంచి రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుని మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నామనటం పెద్ద కామెడీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ చెప్తున్నట్లు తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో 66 శాతం మొగ్గు ఉంటే.. వెంటనే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి అని సవాల్ విసిరారు. ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన 7 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందని, కానీ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణలోని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విరూపాక్ష వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్ళిపోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా కేవలం పార్టీ పదవులకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే రేవంత్ రెడ్డి పాలనకు అసలైన సూచిక అని, సింబల్‌పై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డికి లోపాయికారీ ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లారో, బీజేపీ ఎంపీ రేవంత్ ఇంటిని ఎందుకు రీమోడల్ చేయించారో బీజేపీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్ వంటి వారికి కాంట్రాక్టులు ఇస్తూ రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి స్నేహం చేస్తున్నారని విమర్శించారు. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ఆలోచన శాస్త్రీయంగా లేదని, దీనిపై తమ నాయకులు జీహెచ్‌ఎంసీ సమావేశంలో నిలదీశారని తెలిపారు.





















