Actress Amani joins BJP: బీజేపీలో చేరిన నాటి హీరోయిన్ ఆమని - తెలంగాణలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా?
Amani joins BJP: సినీ నటి ఆమని తెలంగాణ బీజేపీలో చేరారు. మోదీ నాయకత్వం నచ్చి పార్టీలో చేరినట్లుగా తెలిపారు.

Actress Amani joins BJP: ప్రముఖ సినీ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆమని భారతీయ జనతా పార్టీ లో అధికారికంగా చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమని బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఆమనితో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మోదీ దేశం కోసం చేస్తున్న గొప్ప పనులకు, ఆయన పనితీరుకు ఆకర్షితురాలై తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారతీయురాలిగా చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. మోదీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆమె పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వం సనాతన ధర్మం మరియు భారతీయ సంస్కృతిని కాపాడటానికి చేస్తున్న కృషిని ఆమని కొనియాడారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా, సామాజిక బాధ్యతతో పని చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందిస్తున్న ఆమె, ఇప్పుడు రాజకీయ వేదిక ద్వారా ప్రజా సేవకు అంకితమవుతానని ప్రకటించారు.
చలనచిత్ర నటి శ్రీమతి ఆమని గారు భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వక ఆహ్వానం పలికాను.
— N Ramchander Rao (@N_RamchanderRao) December 20, 2025
గౌరవప్రదమైన నటనతో, సామాజిక స్పృహతో ప్రజల మనసు గెలుచుకున్న ఆమని గారు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికత, నాయకత్వం పట్ల ఆకర్షితులై, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని… pic.twitter.com/DUWOXWPihG
1992లో 'జంబ లకిడి పంబ' చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమని, 'శుభలగ్నం', 'శుభ సంకల్పం' వంటి చిత్రాలతో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె 'ఆ నలుగురు', 'MCA' వంటి సినిమాల్లో సహాయ పాత్రల్లోనూ మెప్పించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ పెరుగుతున్న తరుణంలో, ఆమని రాక పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.





















