Chief Minister Revanth Reddy : బంధుప్రీతితో రెబల్స్‌ను బుజ్జగించలేకపోయారు! ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ క్లాస్
Chief Minister Revanth Reddy : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో సమన్వయంతో పని చేయలేదని 18 ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chief Minister Revanth Reddy : తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో అత్యంత కీలకమైన పల్లె పోరు ముగిసింది. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్నే అందించాయి. రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుడి తీర్పు హస్తంవైపు మొగ్గు చూపినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ భారీ విజయం వెనుక ఉన్న ఉత్సాహాన్ని పక్కనపెట్టి పార్టీలోని అంతర్గత లోపాలను సరిదిద్దే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. గెలిచామన్న గర్వం కంటే, పార్టీ క్రమశిక్షణే ముఖ్యం అన్నట్టుగా అధిష్ఠానం వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సంఖ్యల సాక్షిగా... కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురు వేసింది. మూడు విడతల ఎన్నికల సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుంటూ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. తుది లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12, 733 పంచాయతీ సర్పంచి పదవులకు గానీ దాదాపు ఏడు వేలకుపైగా కాంగ్రెస్ మద్ధతు దారులు గెలుచుకున్నారు.
30 జిల్లాల్లో క్లీన్ స్వీప్.. సిద్ధిపేట ఒకటే మినహాయింపు
రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికల కోలాహలం నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చాటుకుంది. ఒక్క సిద్ధిపేట జిల్లా మినహా, మిగిలిన 30జిల్లాల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఇంత ఘన విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం పార్టీ వైఫల్యాలపై లోతైన విశ్లేషణ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షితో కూడిన బృందం టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఫలితాలపై సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాలకు చెందిన సుమారు 18 మంది ఎమ్మెల్యేల పని తీరుపై రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. పార్టీ గెలిచినా, కొన్ని ప్రాంతాల్లో స్థానిక నేతల మొండివైఖరి వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
రెబల్స్ నిర్వహణలో వైఫల్యం, బంధు ప్రీతిపై ఆగ్రహం
ఈ సమీక్షలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించారు.
రెబల్స్ సమన్వయం లోపం;-
ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా నిలబడిన రెబల్స్‌ను బుజ్జగించడంతో, వారిని సమన్వయం చేయడంలో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీని వల్ల ఓట్లు చీలి పార్టీకి తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
బంధు ప్రీతిపై ఆగ్రహం:- కొందు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలు తమ సొంత బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని అధిష్ఠానం తీవ్రంగా తప్పుపట్టింది. అర్హులైన కార్యకర్తలను కాదని, బంధువులకు టికెట్ ఇవ్వడం పార్టీ నియమ నిబంనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి , నియమ నిబంధనలు పాటిస్తూ పని చేయాలని తమ వైఖరి మార్చుకోవాలని ఆదేశించారు. అధికారంలో ఉన్నామన్న అశ్రద్ద పనికిరాదని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.
అధికారం అంటే బాధ్యత, అలంకారం కాదు
తెలంగాణ పంచాయతీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు తిరుగులేని బలాన్ని ఇస్తే, మరోవైపు అంతర్గత ప్రక్షాళనకు అవసరమైన సంకేతాలను ఇచ్చాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విజయాన్ని కేవలం అంకెల్లోనే చూడటం లేదు. క్షేత్రస్థాయిలో నాయకత్వవ జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోకపోతే భవిష్యత్‌లో పార్టీ నుంచి కఠిన చర్యలు తప్పవు అన్న సందేశం సమావేశం ద్వారా స్పష్టమైంది.





















