Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్తా కోడలు పోటీ పడటం. హోరా హోరీ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్త తొడసం లక్ష్మీబాయి విజయం సాధించారు. అత్తకు పోటీగా నిలబడిన కోడలు తొడసం మహేశ్వరి ఓటమి పాలయ్యారు. హిరాపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. లక్షింపూర్, గోపాల్ పూర్, గోకూల్ నగర్, గోపాల్ పూర్ గూడ, మారుతిగూడ, లాల్ టెకిడి, హీరాపూర్ గ్రామస్తులంతా తొలి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసి తమ సర్పంచ్ అభ్యర్థిగా అత్త తొడసం లక్ష్మీబాయిని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 856 ఓట్లు పోల్ అవగా.. అత్త తొడసం లక్ష్మీబాయి కి 355 ఓట్లు పోల్ అయ్యాయి. కోడలు తొడసం మహేశ్వరికి 119 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ సందర్భంగా తొడసం లక్ష్మీబాయి abp దేశం తో మాట్లాడుతూ.. హీరాపూర్ పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపించిన ఏడుగ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిరాపూర్ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలు, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తమ హీరాపూర్ గ్రామానికి ఒక చరిత్ర ఉందని, తమ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డిమల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు వచ్చారని గుర్తు చేసుకున్న లక్ష్మీబాయి..త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి తమ గ్రామ సమస్యలను ఆయనకు చెప్పి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.





















