CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం మొదలు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌరులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్: అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడులు, అందుకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు చేయడంతో మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఒక ప్రకటన చేశారు. ఇరాన్, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు పౌరులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భారత రాయబార కార్యాలయాల (Indian Embassies) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి బటయకు రావొద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతి తెలుగు పౌరుడిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది
ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజల రక్షణ పట్ల ఆందోళన చెందడం సహజం. ఎందుకంటే లక్షలాది మంది తెలుగు వారు ఈ గల్ఫ్ దేశాలలోనే ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న తమ పౌరుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర… pic.twitter.com/InHG2AB4QR
— Telangana CMO (@TelanganaCMO) March 1, 2026
తెలంగాణ సీఎం కీలక సూచనలు
తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. తెలుగు సోదర సోదరీమణులందరూ సురక్షితంగా ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. అక్కడ చిక్కుకున్న వారిని పరిస్థితులను అర్థం చేసుకుని క్షేమంగా భారత్‌కు తరలించడానికి చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ను రేవంత్ రెడ్డి కోరారు. మొత్తం గల్ఫ్ ప్రాంతం యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న ఈ సమయంలో, సీఎం రేవంత్ ఇచ్చిన ఈ భరోసా అక్కడ నివసిస్తున్న వారి కుటుంబాలకు ఊరటనిచ్చింది.
పశ్చిమ ఆసియాలో దారుణమైన పరిస్థితులు
పశ్చిమ ఆసియాలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేయగా, దానికి సమాధానంగా ఇరాన్.. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన అన్ని స్థావరాలు తమ మిస్సైల్ దాడుల పరిధిలోకి వచ్చాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఖతార్, కువైట్, యూఏఈ ఈ దాడులను ధృవీకరించాయి. యూఏఈలో మిస్సైల్ అడ్డుకునే క్రమంలో ఒక వ్యక్తి మరణించారు. హర్మూజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా కూడా నిలిచిపోయింది.
గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు
గల్ఫ్ సంక్షోభం సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి సవాలును ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ సమయంలో కూడా తెలంగాణకు చెందిన 25 మందిని (ఏడుగురు ఇరాన్ నుండి, 18 మంది ఇజ్రాయెల్ నుండి) సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువచ్చారు. తాజా పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.
























