Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్!
Vikarabad Crime News: వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో ఉంటున్న లేడీ కానిస్టేబుల్ దివ్య, తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది.

Vikarabad Crime News: రక్షణ కల్పించాల్సిన పోలీసు యూనిఫామ్‌లో ఉన్న ఒక కానిస్టేబుల్ మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది దివ్య సూసైడ్. ధరూర్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య, తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. ప్రాథమికంగా ఇది కుటుంబ సమస్యల వల్ల జరిగినట్టు కనిపిస్తోంది.
వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో ఉంటున్న దివ్య, తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు, కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
నాన్న లేకపోవడంతోనే బాధలు అంటూ లేఖ
ఆత్మహత్యకు ముందు దివ్య ఒక సూసైడ్ లెటర్ రాసినట్టు సీఐ రఘుకుమార్ వెల్లడించారు. ఆ లేఖలో " నా చావుకు ఎవరూ కారణం కాదు. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు" అని పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితమే ఆమె తండ్రి మరణించినట్టు సమాచారం. అయితే బయటకు కనిపిస్తున్న ఈ కారణం వెనుక ఒక బలమైన మానసిక ఒత్తిడి ఉందనే అనుమానం ఆమె సోదరి, బంధువుల మాటలను బట్టి తెలుస్తోంది.
పెళ్లి సంబంధాలు వెంటాడుతున్న ఒత్తిడి
దివ్య మరణానికి ముందు ఆమె ఒక పెళ్లి సంబంధం విషయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అనలిటిక్ ఆఫీసర్‌తో సంబంధం కుదిరింది. అయితే ఈ సంబంధం కుదిరింది. అయితే ఈ సంబంధం విషయంలో దివ్య సందిగ్ధంలో ఉన్నట్టు ఆమె సోదరి వెల్లడించారు.
ఆమె సోదరి తెలిపిన వివరాల ప్రకారం "దివ్య చాలా సెన్సిటివిటీ కలిగిన అమ్మాయి. పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందేమో, తనను మళ్లీ ఇక్కడికి రానిస్తారో లేదో అని అమె ఆందోళన చెందేది. ఒక వేళ పెళ్లిచేసుకుంటే కుటుంబం ఇబ్బంది పడుతుందని ఆమె తరచూ అంటూ ఉండేది" అని చెప్పారు.
సంబంధం వచ్చినప్పటి నుంచి అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలో ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు చూడాలి అంటూ పదే పదే కాల్స్ చేసే వారని , దివ్య ఫోన్ ఎత్తక పోతే ఆమె సోదరికి కూడా కాల్స్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.
మరీ ముఖ్యంగా, ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి కూడా కార్తీక దివ్యకు ఫోన్ చేసి, తన లొకేషన్ పంపమని కోరినట్టు ఆమె సోదరి పేర్కొన్నారు. నాతోటి కాంటాక్ట్‌లో ఉన్నావు కదా, చెల్లెకు లొకేషన్ ఎందకు పంపమన్నావు అని సోదరి ఆ వ్యక్తిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కాల్స్, పెళ్లి విషయంలో వస్తున్న ఒత్తిడి దివ్యను తీవ్రంగా కలచి వేసినట్టు అర్ధమవుతోంది.
ఆఖరి రాత్రి ఏం జరిగింది?
ఆదివారం పెళ్లి చూపుల కోసం చుట్టాలు వస్తున్నారనే విషయంపై శనివారం రాత్రి దివ్య తన సోదరితో చాలా సమయం మాట్లాడారు. ఆ సమయంలో కూడా దివ్య ఎంతో టెన్షన్‌లో ఉన్నారని, ఒక వేళ నాకు అబ్బాయి నచ్చకపోతే కొలీగ్స్ ఏమనుకుంటారో, ఇంత అహంకారం అనుకుంటారా అని భయపడినట్టు తెలుస్తోంది. ధైర్యం చెబుతూ నీకు నచ్చకపోతే నేనే చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు అని భరోసా ఇచ్చానని సోదరి తెలిపారు. కానీ లోలోపల మదనపడిన దివ్య ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.
వృత్తి పరంగా మంచి గుర్తింపు
దివ్య గత ఆరేళ్లుగా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ధరూర్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా ఆమె పనితీరు పట్ల పైఅధికారులు, సహచరులు ప్రశంసలు కురిపించేవారు. ఎవరితోనూ వివాదాలకు వెళ్లకుండా చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌లెటర్‌లో ఉన్న అంశాలతోపాటు ఆమె ఫోన్ కాల్ డేటాను సేకరించారు. పెళ్లి ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందా ఆమెను ఎవరైనా మానసికంగా వేధించారా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.























