AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
AR Rahman Statement: హిందీ చిత్రసీమలో మతపరమైన వివక్ష ఉందని ఆస్కార్ విన్నర్, అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

ఆస్కార్ విన్నర్, అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman)కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన బాణీలు, సంగీతంతో భారతీయ సినిమా మీద ప్రత్యేకమైన ముద్ర వేశారు. అయితే, ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో మతపరమైన వివక్ష ఉందని ఆయన పేర్కొన్నారు. తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆ కాంట్రవర్సీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఇదీ ఏఆర్ రెహమాన్ వివరణ
ఇవాళ (జనవరి 18న) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఏఆర్ రెహమాన్ తన భావాలను, దృక్పథాన్ని స్పష్టంగా తెలిపారు. "భారతదేశం నా ఇల్లు. నా ప్రేరణ, నా గురువు. ఎవరి మనోభావాలనూ ఎప్పుడూ గాయపరిచే ఉద్దేశ్యం నాకు లేదు. నా ఉద్దేశాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయని నేను అర్థం చేసుకున్నాను. ప్రజలు నా నిజాయితీని, నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకుంటారని, నా మాటలను గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను" అని రెహమాన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజలను, సంస్కృతులను కనెక్ట్ చేయడానికి, భిన్న సంస్కృతుల్లో ఒకరినొకరు గౌరవించడానికి సంగీతం ఒక మార్గం అని ఏఆర్ రెహమాన్ చెప్పారు.
భారతీయుడిని కావడం గర్వకారణం!
తాను భారతీయుడిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''భారత దేశం నాకు నా సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించగల వేదికను ఇచ్చింది. ఈ అవకాశం నాకు వివిధ సంస్కృతుల స్వరాలను గౌరవించడానికి, సంగీతం ద్వారా ప్రజలను కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. భారత దేశం ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలిచింది. నా సంగీతాన్ని మరింత అర్థవంతంగా చేసింది'' అని చెప్పారు.
Also Read: Bheems Bollywood Debut: బాలీవుడ్ వెళుతున్న భీమ్స్... అక్షయ్ కుమార్ సినిమాకు సంగీత దర్శకుడిగా
View this post on Instagram
ఏఆర్ రెహమాన్ తన కెరీర్ నుంచి అనేక చిరస్మరణీయ ప్రాజెక్టులను కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. "నేను జాల ప్రాజెక్ట్‌లో పనిచేశాను, నాగ సంగీతకారులతో స్ట్రింగ్ ఆర్కెస్ట్రాను సృష్టించాను. సన్ షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్శకుడిగా ఉన్నాను. భారత దేశపు మొట్టమొదటి బహుళ సాంస్కృతిక వర్చువల్ బ్యాండ్, సీక్రెట్ మౌంటైన్‌ను స్థాపించాను. రామాయణం కోసం సంగీతంపై నేను హాన్స్ జిమ్మెర్‌కు సహాయ సహకారాలు అందిస్తున్నాను. ఈ అనుభవాలన్నీ నా సంగీత ఉద్దేశ్యాన్ని బలోపేతం చేశాయి" అని తెలిపారు రెహమాన్.
Also Read: ఇస్లాంకు వ్యతిరేకంగా 'ద్రౌపది 2' తీశారా? హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం వేటికి సంకేతం?
భారత దేశం పట్ల తాను కృతజ్ఞుడినై ఉంటానని వీడియో చివరలో ఏఆర్ రెహమాన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... "నా సంగీతం ఎల్లప్పుడూ గతాన్ని గౌరవిస్తుంది. వర్తమానాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తుంది. సంగీతం ఎవరినీ బాధ పెట్టదు. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడానికి సంగీతం ఒక మార్గంగా ఉంది" అని రెహమాన్ స్పష్టం చేశారు.
ఇటీవల BBC నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "బాలీవుడ్‌లో నాకు ఇప్పుడు తక్కువ సినిమాలు వస్తున్నాయి. కొన్నిసార్లు సృజనాత్మక నిర్ణయం తీసుకోవడం సృజనాత్మకత లేని వ్యక్తుల చేతిలో ఉంటుంది. అది కొన్నిసార్లు మతపరమైన కారణాల వల్ల కావచ్చు'' అని చెప్పారు. ఆ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.




















