Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Andhra CM Chandrababu: కొత్తగా పుట్టుకొచ్చిన రప్పా రప్పా రాజకీయ సంస్కృతిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్షనిజం, మావోయిజంను నిర్మూలించి ప్రగతి సాధించామ.. ఇలాంటి వాటిని సహించబోమన్నారు.

Chandrababu Naidu speech in the Assembly: ఏపీ శాసనసభలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం అటు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ఇటు రాష్ట్ర భవిష్యత్తుపై దిశానిర్దేశం చేసేలా సాగింది. రాష్ట్రంలో ఫాక్షనిజం, మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించి ప్రగతి సాధించామని గుర్తు చేస్తూనే, ప్రస్తుతం కొత్తగా పుట్టుకొచ్చిన రప్పా రప్పా రాజకీయ సంస్కృతిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పర్యటనల పేరుతో హింసను ప్రేరేపించడం, ఎస్సై స్థాయి అధికారులపై దాడులు జరగడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన
రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్‌లను ప్రోత్సహించే నాయకులు తయారయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. కటౌట్లకు పొట్టేళ్లను బలి ఇచ్చి రక్తాభిషేకం చేయడం వంటి హింసాత్మక పద్ధతులు నేరుగా నేరస్తులను ప్రోత్సహించడమేనన్నారు. పరామర్శల పేరుతో గంటల తరబడి ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తూ, బలప్రదర్శన చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. పోస్టుమార్టానికి కారణమైన వారే.. ఇప్పుడు పోస్టుమార్టానికి వెళ్తామనడం విడ్డూరం అంటూ ప్రతిపక్ష నేతలపై పరోక్షంగా సెటైర్లు వేశారు.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పారిశ్రామిక ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురిచేయడం రాష్ట్ర ద్రోహమేనని ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల వల్ల ఇప్పటికే మార్కెట్లు ప్రభావితమై ఎగుమతులు తగ్గాయని, ఇలాంటి క్లిష్ట సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపవిత్రతపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇది తెలియక జరిగిన పొరపాటు కాదు.. కుట్రపూరితంగా చేసిన నేరం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీడీబీ నివేదిక కల్తీ నెయ్యిని ధ్రువీకరించినప్పటికీ, తప్పు చేసిన వారు కనీసం క్షమాపణలు చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే మొదలైందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఐక్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్లుగా, రాబోయే 15 ఏళ్ల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి సుస్థిరత లభిస్తుందని పేర్కొన్నారు. మనకు ఒక అజెండా ఉంది.. 2029లో మళ్ళీ గెలవాలి, 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టాలి అని తన లక్ష్యాన్ని వివరించారు.
ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు - నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరి వ్యక్తిగత ప్రవర్తన వల్ల కూడా ప్రభుత్వానికి లేదా కూటమి పార్టీలకు ఇబ్బంది కలగకూడదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ప్రజల మద్దతుతోనే మనం ఈ స్థానంలో ఉన్నామని ప్రతి నిమిషం గుర్తుంచుకుని పనిచేయాలని కోరారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















