Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyderabad Cyber Fraud | హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అధిక లాభాల పేరుతో నమ్మించి దశల వారీగా అతడి వద్ద నుంచి రూ.2.9 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశచూపి సామాన్యులను దోచుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్ల వలలో పడి శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి, భారీగా నష్టపోయాడు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బాధితుడు ఏకంగా రూ. 2.9 కోట్లు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, చివరకు తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
అసలేం జరిగిందంటే..
గతేడాది నవంబరులో బాధితుడు (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి) వాట్సప్‌కు వచ్చిన ఒక గుర్తు తెలియని లింక్ ఈ మోసానికి కారణమైంది. స్టాక్ మార్కెట్ సలహాలు ఇస్తామన్న ప్రకటనను నమ్మి ఆ లింక్ క్లిక్ చేయడంతో గ్రూపులో చేరాడు. అక్కడ 'అనిల్ గోయల్' అనే వ్యక్తి పరిచయమై, తమ సలహాలతో 300 శాతం లాభాలు పొందవచ్చని నమ్మించాడు. బాధితుడి నమ్మకాన్ని చూరగొనేందుకు కేటుగాళ్లు నకిలీ స్క్రీన్‌షాట్లు చూపడమే కాకుండా, ప్రారంభంలో పెట్టిన రూ. 50 వేల పెట్టుబడికి అదనంగా రూ. 5 వేల లాభాన్ని కూడా చెల్లించారు. దీంతో వారి మాటలు నిజమేనని నమ్మిన ఐటీ ఉద్యోగి,తన వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ పలు దఫాలుగా దాదాపు రూ. 2.9 కోట్ల రూపాయలను వివిధ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అసలుతో కలిపి 3.47 కోట్లు చూపించిన యాప్
బాధితుడు వాడిన యాప్‌లో వర్చువల్‌గా లాభం కలిపి రూ. 3.47 కోట్లు ఉన్నట్లు చూపించేవారు. అయితే, పెరిగిన అప్పుల భారం తీర్చడానికి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. డబ్బులు విత్‌డ్రా చేయడం సాధ్యం కాదని, మరికొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు వేధించారు. తాను మోసపోయానని గుర్తించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను ఎవరూ నమ్మవద్దు. అధిక లాభాలు ఆశచూపే యాప్‌లు, వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సైబర్ నిపుణులు సూచించారు. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.





















