Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Telangana Rising 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రశంసించడం కాదు, ఆరు గ్యారంటీలు, అభయహస్తం హామీలు నెరవేర్చాలంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారు. ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047పై, రెండేళ్ల పాలనపై ఢిల్లీకి వెళ్లి ఇచ్చిన రిపోర్టును సోనియా గాంధీ మెచ్చుకోవడాన్ని కిషన్ రెడ్డి తన లేఖలో తీవ్రంగా విమర్శించారు.
విజన్ డాక్యుమెంట్ అభినందనలపై విమర్శలు
తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీకి అందజేసినప్పుడు, ఆమె ప్రభుత్వాన్ని అభినందించడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. గత రెండు ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని మెచ్చుకోవడం కంటే, ప్రజలకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలోని హామీల అమలు పరిస్థితి ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్త ఆశలు కల్పించే ముందు.. పాత హామీల అమలును పరిశీలించాల్సిన బాధ్యత సోనియా గాంధీపై ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ లేఖలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
6 గ్యారంటీల అమలుపై ప్రశ్నలు
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ సభలో సోనియా గాంధీ స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నా, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, కనీసం ముఖ్యమంత్రిని వీటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని తీవ్రంగా విమర్శించారు.
మోసపూరిత హామీలు, అభయహస్తమే భస్మాసుర హస్తం
ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి 'విజన్ డాక్యుమెంట్' పేరుతో కొత్త పల్లవి అందుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీ హామీలను గాలికొదిలేసి ప్రజలను వంచిస్తున్నారని, ఈ తీరు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారి ఆ పార్టీని అధికారానికి దూరం చేస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి..
రైతులు, మహిళలు, నిరుద్యోగులు, దళితులు మరియు వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడకపోతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని కిషన్ రెడ్డి తన లేఖ ద్వారా హెచ్చరించారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏం ప్రకటించింది..
తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలు ఇవే:
మహాలక్ష్మి: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ రూ. 500కే అందజేత మరియు ఉచిత బస్సు ప్రయాణం.
రైతు భరోసా: రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 పెట్టుబడి సాయం.
గృహ జ్యోతి: ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
ఇందిరమ్మ ఇండ్లు: ఇల్లు లేని వారికి ఇంటి పట్టా, ఇల్లు నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం.
యువ వికాసం: విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్.
చేయూత: నెలకు రూ. 4,000 పింఛను, రూ. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ భీమా.






















