World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Pakistan Loan from World Bank: పాకిస్తాన్ సమగ్ర అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసింది. ఆ రుణాలు సమర్థవంతంగా, పారదర్శకంగా వాడాలని సూచించింది.

ప్రపంచ బ్యాంక్ శనివారం (డిసెంబర్ 20న) పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. పాక్‌లో ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి, ప్రజా సేవల సరఫరాను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమం కింద 700 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు 70 కోట్ల డాలర్లు) ఆర్థిక సహాయాన్ని వరల్డ్ బ్యాంక్ ఆమోదించింది.
పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ నివేదిక ప్రకారం, ప్రపంచ బ్యాంక్ అందించిన ఆర్థిక సహాయం పబ్లిక్ రిసోర్సెస్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్-మల్టీఫేజ్ ప్రోగ్రామాటిక్ అప్రోచ్ (PRID-MPA) కింద విడుదల చేసింది. ఇది మొత్తం 1.35 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు నిధులను అందించగల ఒక ఫ్రేమ్‌వర్క్.
ఈ డబ్బును పాకిస్తాన్ ఎక్కడ ఉపయోగిస్తుంది?
నివేదిక ప్రకారం, ప్రపంచ బ్యాంక్ ఆమోదించిన 700 మిలియన్ డాలర్లలో, 600 మిలియన్ డాలర్లు ఫెడరల్ స్థాయి పథకాలకు వాడతారు. మిగిలిన 100 మిలియన్ డాలర్లు సింధ్ ప్రావిన్షియల్ కార్యక్రమానికి కేటాయించనున్నారు. ఆగస్టులో పంజాబ్‌లో ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన 47.9 మిలియన్ డాలర్ల గ్రాంట్ తర్వాత ఈ ఆమోదం లభించింది
ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో ఏముంది?
ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో పాకిస్తాన్ కోసం బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ బోలోర్మా అమగబజార్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ సమగ్ర, స్థిరమైన అభివృద్ధి మార్గానికి దేశీయ వనరులను ఎక్కువగా సమీకరించడం.. వాటిని సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు ఫలితాలను ఇచ్చేలా ఉపయోగించడం చాలా ముఖ్యం" అని అన్నారు.
బోలోర్మా అమగబజార్ మాట్లాడుతూ "MPA ద్వారా, బ్యాంక్ ఫెడరల్ ప్రభుత్వం, సింధ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. తద్వారా పాఠశాలలు, క్లినిక్‌లకు మరింత ఊహించదగిన నిధులు, మరింత న్యాయమైన పన్ను వ్యవస్థ మరియు నిర్ణయం తీసుకోవడానికి బలమైన డేటా వంటి స్పష్టమైన ఫలితాలు వస్తాయి. దీనితో పాటు ప్రాథమిక, సామాజిక, వాతావరణ పెట్టుబడులను రక్షించడంతో పాటు ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది"
రాజకీయ జోక్యం వల్ల పెట్టుబడులు ప్రభావితం
పాకిస్తాన్ కోసం ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ టోబియాస్ అఖ్తర్ హక్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆర్థిక పునాదిని బలోపేతం చేయడం విస్తృత ఆర్థిక స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, ఫలితాలను అందించడానికి, సంస్థలను బలోపేతం చేయడానికి అవసరమని అన్నారు. ఆయన మాట్లాడుతూ "PRID-MPA ద్వారా మేము ఒక స్థిరమైన, జాతీయ స్థాయి విధానాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఆర్థిక పరిధిని విస్తరించడానికి, మానవ మూలధనం, వాతావరణ స్థితిస్థాపకతలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మద్దతు ఇస్తుంది. ఆదాయ పరిపాలన, బడ్జెట్ అమలు, గణాంక వ్యవస్థలను బలోపేతం చేయడంలో సంస్కరణలకు ఊతమిస్తోంది. ఈ సంస్కరణలు వనరులు నేరుగా క్షేత్రస్థాయికి చేరేలా, పాకిస్తాన్ అంతటా ప్రజలకు మరింత సామర్థ్యం, బాధ్యతతో మెరుగైన ఫలితాలను అందించేలా చూస్తాయి" అన్నారు.






















