Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
రెండేళ్ల క్రితం అంటే 2023 చివర్లో ఇషాన్ కిషన్ ఉన్నపళంగా భారత జట్టును వీడి వెళ్లిపోయాడు. దీనికి రీజన్ మానసిక సమస్యలని చెప్పాడు. తనకు మెంటల్ హెల్త్ మీద లీవ్ కావాలని కొన్నాళ్లు మ్యాచ్ లకు తనను కన్సిడర్ చేయొద్దని చెప్పాడు. అయితే ఇదంతా తను ఐపీఎల్ కి సన్నద్ధం కావటం కోసం చేశాడంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తను ఎంతగానో ఇష్టపడిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా తనను వదిలిపెట్టడం ఇషాన్ కెరీర్ లో పెద్ద షాక్. అయితే తనను నమ్మి తీసుకున్న సన్ రైజర్స్ నమ్మకాని పదింతలు చేస్తూ తను SRH కి ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత నుంచి భారత జట్టుకు ఎంపికకాకపోయినా నిరుత్సాహ పడలేదు. తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్ టీమ్ ప్రదర్శనను మెరుగుపర్చేందుకు విపరీతంగా కృషి చేసిన ఇషాన్ కిషన్ ఈ ఏడాది ఎవరూ ఊహించని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఝార్ఖండ్ ను విజేతగా నిలిపాడు కెప్టెన్ ఇషాన్ కిషన్. ఫైనల్లో హర్యానాపై భారీ సెంచరీ బాదటం పాటు టోర్నీలో 571 పరుగులతో తన తిరుగులేని ఫామ్ ను చాటి చెప్పాడు. దేశవాళీ ప్రదర్శనే టీ20 వరల్డ్ కప్పు జట్టుకు ప్రాధాన్యం కాబట్టి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇషాన్ కిషన్ ఫామ్ ను ఒప్పుకోక తప్పలేదు. 2026 టీ20 వరల్డ్ కప్పు జట్టు ప్రకటనలో ఇషాన్ కిషన్ ను సెలక్షన్ కమిటీ కన్సిడర్ చేసింది. ప్రధాన వికెట్ కీపర్ అయిన సంజూ శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా తుది 15మంది జట్టులో ఇషాన్ కిషన్ కి స్థానం కల్పించింది సెలక్షన్ కమిటీ. ఫలితంగా రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచుల్లోకి ఇషాన్ కిషన్ తిరిగి అడుగుపెట్టనున్నాడు. అయితే తుది 11మంది జట్టులో ఇషాన్ కిషన్ ఆడే అవకాశాలు చాలా తక్కువ. సంజూ శాంసన్ కు గాయమైతోనో...టీమ్ మేనేజ్మెంట్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అదనంగా ఓపెనింగ్ వన్ డౌన్ స్లాట్ లో కావాలనుకుంటేనో తప్ప ఇషాన్ కిషన్ వరల్డ్ కప్పు మ్యాచులు ఆడే అవకాశం తక్కువ.





















