Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఎన్నో విశిష్టతలకు నిలయం. రెండేళ్లకోసారి జరిగే ఈ వన దేవతల పండుగలో ఒక అంతుచిక్కని అద్భుతం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది ఏంటంటే జాతర ప్రాంగణంలో ఈగలు కనిపించకపోవడం. సాధారణంగా ఒక చిన్న బెల్లం ముక్క బయట ఉంటేనే వందల ఈగలు ముసురుతాయి. కానీ, లక్షల క్వింటాళ్ల బెల్లం నైవేద్యంగా సమర్పించే మేడారంలో ఒక్క ఈగ కూడా వాలదు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? భక్తుల నమ్మకం ఏంటి?
మేడారం జాతరలో భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. మేడారం గద్దెల పరిసరాల్లో టన్నుల కొద్దీ బెల్లం కుప్పలు కనిపిస్తాయి. అయినా సరే, అక్కడ మనకు ఈగలు అస్సలు కనిపించవు. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి అని అంటారు భక్తులు.
గిరిజన సంప్రదాయం ప్రకారం, సమ్మక్క-సారలమ్మలు ప్రకృతి దేవతలు. వారు కొలువుదీరిన ఆ వన ప్రాంతం అత్యంత పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు. అమ్మవార్ల శక్తి వల్ల దుష్ట శక్తులు మాత్రమే కాదు, కనీసం వ్యాధులు వ్యాప్తి చేసే ఈగలు, కీటకాలు కూడా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టలేవని భక్తుల నమ్మకం. జాతర ముగిసి అమ్మవార్లు వన ప్రవేశం చేసే వరకు ఈ అద్భుతం కొనసాగుతుందని స్థానికులు చెబుతారు.
మరో కారణం ఏంటంటే మేడారం చుట్టూ దట్టమైన వనమూలికలు, వేప, ఇప్ప వంటి చెట్లు ఉన్నాయి. ఇవి సహజ సిద్ధమైన insecticides గా పనిచేస్తాయి. అలాగే జాతరలో భక్తులు నిరంతరం ధూపం వేస్తారు. లక్షలాది మంది వంటలు చేయడం వల్ల వచ్చే పొగ కీటకాలను రానివ్వదు. జంపన్న వాగు నిరంతరం ప్రవహిస్తూ ఉండటం వల్ల కూడా ఈగలు రావని అంటారు.





















